తల్లిదండ్రులు విడిపోవడాన్ని తట్టుకోలేక కుమారుడి విషాదాంతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారుపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఆరు నెలలుగా వేర్వేరుగా ఉంటుండటాన్ని తట్టుకోలేక వారి ఒక్కగానొక్క కుమారుడు కిరణ్‌ (22) తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తల్లిదండ్రులను తిరిగి కలిపేందుకు పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో బలవన్మరణానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తల్లిదండ్రులు విడిపోవడాన్ని తట్టుకోలేక కుమారుడి విషాదాంతం
Kiran

Edited By:

Updated on: Aug 08, 2026 | 6:26 PM

పెళ్లైన కొన్నేళ్లు అన్యోన్యంగా సాగిన ఆ దంపతుల కాపురంలో.. ఆ తర్వాత మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. కలిసి ఉండలేక ఆరు నెలలుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే.. తల్లిదండ్రులు విడిపోవడాన్ని కన్న కొడుకు మాత్రం జీర్ణించుకోలేకపోయాడు. వారిద్దరినీ మళ్లీ కలపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవీ ఫలించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరకు ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామంలో చోటుచేసుకుంది.

అన్నారుపాడుకు చెందిన బాణోత్ నరసింహ, విజయ దంపతులు. వీరిది చిన్నకారు రైతు కుటుంబం. వారికి ఒక్కగానొక్క కుమారుడు కిరణ్ (22). కొత్తగూడెం సమీపంలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కొంతకాలంగా నరసింహ, విజయ దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో.. ఆరు నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. విజయ సుజాతనగర్ మండలం సర్వారం గ్రామంలోని తన పుట్టింటి వద్ద ఉంటుండగా.. నరసింహ తన కుమారుడు కిరణ్‌తో కలిసి అన్నారుపాడులో ఉంటున్నారు.

తల్లిదండ్రులు విడిపోయి వేర్వేరుగా ఉండటాన్ని కిరణ్ తీవ్రంగా బాధపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారిద్దరినీ తిరిగి కలిపేందుకు కిరణ్ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో భవిష్యత్తులో తల్లిదండ్రులు మళ్లీ కలుస్తారా లేదా అన్న ఆందోళనతో అతడు మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వద్ద పలుమార్లు చెప్పినట్లు సమాచారం.

ఈ క్రమంలో గురువారం రాత్రి తండ్రి నిద్రించిన తర్వాత కిరణ్ పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే అతడిని కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం కిరణ్ మృతి చెందాడు. ఘటనపై కిరణ్ తండ్రి నరసింహ జూలూరుపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

22 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో అన్నారుపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు విడిపోవడం తన కుమారుడిపై తీవ్ర ప్రభావం చూపిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us