
హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహ్మద్ హుస్సేన్ హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. కేవలం రూ.700 గంజాయి గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా గుర్తించగా, ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మెహిదీపట్నం లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన మహ్మద్ హుస్సేన్ అలియాస్ వసీమ్ ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. గంజాయి ఇప్పిస్తానని చెప్పి హుస్సేన్ నిందితుల వద్ద నుంచి రూ. 700 తీసుకున్నాడు. అయితే, చెప్పినట్లుగా గంజాయి ఇవ్వకపోగా, తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వమని అడిగినా నిరాకరించాడు. దీంతో హుస్సేన్‌పై నిందితులు కక్ష పెంచుకున్నారు.
ఈ నెల 9న నిందితులు పథకం ప్రకారం.. హుస్సేన్‌ను అత్తాపూర్ ఖుషీ ఫంక్షన్ హాల్ సమీపంలో అడ్డగించారు. తొలుత అక్కడ విచక్షణారహితంగా దాడి చేసి, ఆ తర్వాత మరో ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచారు. రక్తపు మడుగులో ఉన్న హుస్సేన్‌ను ఏజీ కాలేజ్ మెయిన్ గేట్ వద్ద పడేసి నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు వెంటనే బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ హుస్సేన్ మరణించాడు.
ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న అత్తాపూర్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలతో మొత్తం 10 మంది నిందితులను గుర్తించారు. వారిలో ముగ్గురిని అరెస్ట్ చేయగా, మిగతా 7గురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుల వద్ద నుంచి వారు వాడిన వాహనాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వ్యసనం, చిల్లర డబ్బుల గొడవలు యువతను నేరాల వైపు ఎలా నడిపిస్తున్నాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.