“ఇప్పుడు డిసైడ్ అయ్యా.. ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతా”: పవన్

తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. "తెలంగాణలో నన్ను అడుగుపెట్టనివ్వమని బెదిరిస్తున్నారు.. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?" అంటూ ఆయన కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు జన సైనికులం భయపడేవాళ్లం కాదన్నారు.

ఇప్పుడు డిసైడ్ అయ్యా.. ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతా: పవన్
Ap Deputy Cm Pawan Kalyan

Updated on: Jun 02, 2026 | 5:36 PM

తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. “తెలంగాణలో నన్ను అడుగుపెట్టనివ్వమని బెదిరిస్తున్నారు.. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?” అంటూ ఆయన కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు జన సైనికులం భయపడేవాళ్లం కాదన్నారు.

తెలంగాణ రాజకీయాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి. తనను తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమంటూ కొందరు నాయకులు చేస్తున్న హెచ్చరికలపై ఆయన యుద్ధం ప్రకటించారు. ఇప్పటిదాకా తెలంగాణ రాజకీయాలపై పెద్దగా దృష్టి పెట్టని పవన్, ఇప్పుడు రూట్ మార్చారు. “ఇప్పటిదాకా నేను ఆలోచించలేదు.. కానీ ఇకపై తెలంగాణలో జనసేన ఉంటుంది. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తాం, నేనే స్వయంగా తిరుగుతా” అని పవన్ ఖచ్చితంగా చెప్పారు. తెలంగాణ ఏమైనా ఒకరి సొత్తా? అని ప్రశ్నిస్తూ.. “తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. ఇక్కడి ప్రతి సమస్యపై పోరాడతా, ప్రతి అన్యాయంపై గొంతు ఎత్తుతా” అని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనసేన ప్రస్థానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. “ఇప్పుడు డిసైడ్ అయ్యా.. ఇకపై తెలంగాణలో నేనే స్వయంగా తిరుగుతా, ఇక్కడి ప్రతి ప్రజా సమస్యపై పోరాడుతా” అని ప్రకటించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు దక్షిణాదికి వచ్చి పోటీ చేయనప్పుడు, భారతదేశంలో భాగమైన తెలంగాణలో తాను ఎందుకు తిరగకూడదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో మహబూబ్‌నగర్, ఖమ్మంలో దాడులు చేసినప్పుడే తట్టుకుని నిలబడ్డామని పవన్ గుర్తుచేశారు. “నాపై తొలి కేసు నమోదైందే తెలంగాణలో. నాలుక కోస్తామని మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు చెబుతున్నా.. ఎవరొస్తారో రండి, నా నాలుక చూపిస్తా” అంటూ సవాల్ విసిరారు.

తెలంగాణ నడిబొడ్డునే జనసేన పుట్టిందని, ఇక్కడ లక్ష మందికి పైగా జనసేన సైనికులు ఉన్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయాల కోసం కొత్తగా తెచ్చుకున్నది కాదని, తన సినిమాల్లోనూ ఇక్కడి పోరాట స్ఫూర్తి కనిపిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడటమే తన లక్ష్యమని పవన్ ప్రకటించడంతో ఇక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us