
హైదరాబాద్ పాతబస్తీ గోమతి ఎలక్ట్రానిక్స్ దుకాణం పేలుడు కేసులో మరొకరు మృతి చెందారు. ఈ పేలుడుపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తు జరిపిన అధికారులు ఇది గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్‌గా క్లూస్ టీం నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో మరొకరు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య మూడుకు చేరింది. ఈ ఘటన జరిగిన రోజు నుంచి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముబాషీర్ ఈ రోజు మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఈ ఘటన జరిగిన సమయంలో పేలుడు సంభవించడంతో మొదట ప్రమాదం గురించి ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం అధికారులు, అనేక కోణాల్లో దీనిపై విచారణ చేపట్టారు. భారీ శబ్దంతో చిద్రమై ఎగిరిపోవడంతో శకలాలు 100 మీటర్ల దూరం వరకు చెల్లాచెదురుగా పడినట్లు క్లూస్ టీం గుర్తించింది.
పేలుడు దాటికి గోమతి ఎలక్ట్రానిక్స్ షాప్ ముందు పార్క్ చేసిన కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరుసటి రోజు షాప్ ఓనర్ అగర్వాల్ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సైట్‌ను సమగ్రంగా పరిశీలించిన క్లూస్ టీం మొదటి నుంచి చేపట్టిన టెక్నికల్ అనాలిసిస్‌లో కీలక వివరాలు బయటపడ్డాయి. గోమతి ఎలక్ట్రానిక్స్ దుకాణంలో గ్యాస్ లీక్ కావడంతో ఏర్పడిన పేలుడే అగ్ని ప్రమాదానికి కారణమని, ఇతర కారణాలు లేవని పోలీసులు నిర్ధారించారు.
అయితే ఈ బ్లాస్ట్ తరువాత మంటలు చెలరేగుతూ దుకాణంలో ఉన్న ఫ్రిజ్‌లు, ఏసీల కంప్రెసర్లు వరుసగా పేలిపోవడం కారణంగా అగ్ని ప్రమాదం తీవ్రత మరింత పెరిగిందని నివేదిక పేర్కొంది. పేలుడు దాటికి 50 మీటర్ల దూరం వరకు భారీ శకలాలు ఎగిరిపడ్డాయి. దుకాణం మొత్తం కూలిపోయేలా తీవ్ర నష్టం జరిగినట్లు నిపుణులు తెలిపారు.
ఈ ప్రమాదం జరిగిన కొద్ది సెకండ్ల ముందు ఒక పోలీసు వాహనం అటుగా వెళుతున్నట్లు కనిపించింది. పోలీస్ వాహనం షాపు ముందుకు చేరుకోగానే ఒక్కసారిగా భారీ శబ్దంతో ఈ పేలుడు సంభవించింది. తృణప్రాయంలో పోలీసులు తమ ప్రాణాలు కాపాడుకోగలిగారు. కొద్ది సెకండ్లు ముందు ఉన్నా, ఈ పేలుడు దాటికి పోలీసులు కూడా గాయపడే పరిస్థితి ఉండేదంటున్నారు నిపుణులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..