Weather: అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఓ వైపు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి.. ఓ వైపు ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు.. రెండు మూడు రోజుల నుంచి తగ్గిన ఉష్ణోగ్రతలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.

Weather: అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Weather Report

Updated on: Mar 25, 2025 | 7:39 AM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఓ వైపు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి.. ఓ వైపు ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు.. రెండు మూడు రోజుల నుంచి తగ్గిన ఉష్ణోగ్రతలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అలాగే.. కొన్ని ప్రాంతాల్లో ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. తెలంగాణలో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశ ముందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలోని ఆ ప్రాంతాలకు అలర్ట్..

దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుండి మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది.. ఆ తరువాత క్రమేపి రెండు నుండి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు గరిష్టంగా అదిలాబాద్ లో 38.3 కనిష్టంగా హైదరాబాద్ లో 33.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మం, మహబూబ్ నగర్ లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఆదిలాబాద్..38.8, నిజామాబాద్..37.8, భద్రాచలం..37.2, ఖమ్మం..37.2, మహబూబ్ నగర్..35.6, నల్లగొండ..35.5, రామగుండం..35, మెదక్..34.6, హనుమకొండ..34.5, హైదరాబాద్..33.6 డిగ్రీల పగలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు..

మంగళవారం ఏపీలోని 52 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నేడు శ్రీకాకుళం జిల్లా -8, విజయనగరం జిల్లా-10, పార్వతీపురంమన్యం జిల్లా-12, అల్లూరి సీతారామరాజు జిల్లా-6, కాకినాడ-5, తూర్పుగోదావరి-6, ఏలూరు-2, ఎన్టీఆర్ జిల్లా 3 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. సోమవారం అనంతపురం జిల్లా నాగసముద్రంలో 39.9°C, వైఎస్సార్ జిల్లా అట్లూరు 39.8°C, చిత్తూరు జిల్లా నిండ్ర 39.7°C, నంద్యాల జిల్లా దొర్నిపాడు 39.6°C, ప్రకాశం జిల్లా గుంటుపల్లి 39.2°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. అలాగే మూడు మండలాల్లో వడగాల్పులు వీచాయి. వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..