
కోవిడ్ కొత్త వేరియంట్‌పై ఏపీ సర్కార్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా 29 RTPCR ల్యాబ్‌లలో పరీక్షలు జరుగుతున్నాయంది ప్రభుత్వం. విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామని అంటోంది. విలేజ్ క్లినిక్‌లలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచినట్టు చెబుతోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అంటోంది ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ.
మరోవైపు తెలంగాణలోనూ కోవిడ్ రివ్యూ మీటింగ్ జరిగింది. మంత్రి హరీష్ రావు ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బూస్టర్ డోసులు పెంచాలని.. కోవిడ్ చికిత్సకు సంబంధించి అన్నిరకాల ఏర్పాట్లు జరగాలన్నారు. ట్రాక్ అండ్ ట్రేసింగ్‌ద్వారా కొత్త వేరియంట్స్‌ను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మినహా మరెక్కడా కోవిడ్ కేసులు నమోదు కావటం లేదని చెబుతున్నాయి గణాంకాలు.
ఇంతకీ బీఎఫ్.7 లక్షణాలేంటన్న చర్చ జరుగుతోంది. ఈ కొత్త వేరియంట్ లక్షణాలపై ఇపుడిపుడే కొంత స్పష్టత వస్తోంది. ఈ వేరియట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఒకరికి ఈ వేరియంట్ సోకితే.. వారి నుంచి 10 నుంచి 18 మంది వరకూ విస్తరిస్తుందని అంటోంది WHO. ఒమిక్రాన్ వేరియంట్ కంటే బీఎఫ్.7 వేగంగా వ్యాపిస్తుందనీ, ఈ వేరియంట్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, గొంతు గరగర, జలుబు, నీరసం, విపరీతంగా ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయనీ అంటున్నారు వైద్య నిపుణులు. అతి కొద్ది కేసుల్లో మాత్రమే వాంతులు, డయేరియా వంటి పొట్ట సంబంధ వ్యాధులు బయటపడవచ్చని చెబుతున్నారు వైద్యులు.
రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంతే కాదు ఈ వేరింట్ విస్తరణపై ప్రతీ వారం సమీక్ష చేయాలని నిర్ణయించింది. విమానాశ్రయాలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకించి చైనా నుంచి వచ్చే వారి విషయంలో జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు నిపుణులు. ప్రధాని సమీక్ష తరువాత రాష్ట్రాలకు మరిన్ని కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..