Hyderabad: 2300 ఏళ్ల క్రితం ఈజిప్ట్‌లో శ్వాస ఆగిన యువతి.. భాగ్యనగరానికి ఎలా వచ్చిందబ్బా..!

హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, నిజాం వారసత్వం గుర్తుకు వస్తాయి. కానీ నగరం గుండెల్లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రపంచ చరిత్రను మోస్తున్న ఒక అరుదైన అవశేషం నిశ్శబ్దంగా పడి ఉంది. అదే 2300 ఏళ్ల క్రితం ఈజిప్ట్‌లో శ్వాస ఆగిన ఒక యువతి మమ్మీ. భారతదేశంలో ఉన్న అరుదైన ఆరు ఈజిప్ట్ మమ్మీలలో ఇది ఒకటి కావడం దీని ప్రత్యేకత.

Hyderabad: 2300 ఏళ్ల క్రితం ఈజిప్ట్‌లో శ్వాస ఆగిన యువతి.. భాగ్యనగరానికి ఎలా వచ్చిందబ్బా..!
Egypt Mummy In Telangana State Museum

Edited By:

Updated on: Apr 07, 2026 | 5:52 PM

హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, నిజాం వారసత్వం గుర్తుకు వస్తాయి. కానీ నగరం గుండెల్లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రపంచ చరిత్రను మోస్తున్న ఒక అరుదైన అవశేషం నిశ్శబ్దంగా పడి ఉంది. అదే 2300 ఏళ్ల క్రితం ఈజిప్ట్‌లో శ్వాస ఆగిన ఒక యువతి మమ్మీ.

తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్న ఈ మమ్మీని సాధారణంగా ప్రిన్సెస్ నైషుగా పిలుస్తారు. ప్టోలెమిక్ ఈజిప్ట్ కాలానికి చెందిన ఈ మమ్మీ సుమారు క్రీ.పూ. 300 – 100 మధ్య నాటిదిగా పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ఉన్న అరుదైన ఆరు ఈజిప్ట్ మమ్మీలలో ఇది ఒకటి కావడం దీని ప్రత్యేకత.

ఈ మమ్మీ హైదరాబాద్‌కి చేరిన కథ మరింత ఆసక్తికరం..! 1930 ప్రాంతంలో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ అల్లుడు నజీర్ నవాజ్ జంగ్ విదేశీ వేలంలో దీన్ని 1000 బ్రిటిష్ పౌండ్లకు కొనుగోలు చేశాడు. అనంతరం ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు బహుమతిగా అందజేశాడు. ప్రపంచ చారిత్రక సంపదను హైదరాబాద్‌కు తీసుకురావాలన్న నిజాం రాజవంశ దూరదృష్టికి ఇది నిదర్శనంగా నిలిచింది. తర్వాత నిజాం దీనిని మ్యూజియంకు అందజేయడంతో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

1931లో మ్యూజియం ప్రారంభమైన నాటి నుంచి ఈ మమ్మీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఒకప్పుడు ఈజిప్ట్ ఎడారుల్లో భూసమాధి అయిన మానవ అవశేషం, ఇప్పుడు హైదరాబాద్‌లో వేలాది మంది సందర్శకులను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా పిల్లలు, పర్యాటకులు, చరిత్రాభిమానులు ఈ గ్యాలరీ వద్ద ఎక్కువసేపు గడుపుతుంటారు.

కాలక్రమంలో మమ్మీపై కవరింగ్ దెబ్బతినడంతో 2016లో ప్రత్యేక రిస్టోరేషన్ చేపట్టారు. ప్రస్తుతం దీన్ని ఆక్సిజన్-రహిత నైట్రోజన్ చాంబర్ గ్లాస్ కేస్‌లో భద్రపరుస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల మరింత కాలం మమ్మీని సురక్షితంగా ఉంచే అవకాశం ఏర్పడింది. ఈజిప్ట్ నాగరికతలో మరణానంతర జీవితం నమ్మకానికి చిహ్నమైన ఈ మమ్మీ, ఇప్పుడు హైదరాబాద్ వారసత్వంలో ఒక ప్రపంచస్థాయి ఆకర్షణగా నిలిచింది. చార్మినార్ నగరంలో ఇలాంటి అరుదైన ఈజిప్ట్ చరిత్ర భాగం ఉండటం నిజంగా విశేషమే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us