Telangana: ప్రభుత్వం జీవోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సిందే.. సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు

విడుదలైన ప్రభుత్వ జీవోలు.. వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టలేదంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. జీవోల విషయంలో అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్ఎస్ ఆరోపిస్తే.. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చాలా జీవోలను దాచిపెట్టిందని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు.

Telangana: ప్రభుత్వం జీవోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సిందే.. సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు
Telangana High Court

Updated on: Dec 25, 2025 | 7:56 AM

ప్రభుత్వ జీవోలు అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టకపోవడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. రెండేళ్లలో ప్రభుత్వం 9 వేల 64 జీవోలు జారీ చేస్తే అందులో 3 వేల 290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయని పిటిషనర్ వాదించారు. మిగతా జీవోలను వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. తక్షణమే జీవోలన్నీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోలను దాచి పెడుతోందన్నారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు. ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటోన్న రేవంత్‌రెడ్డి.. చీకటి జీవోలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.

13 నెలల్లో 15వేల 77 జీవోలు దాచిపెట్టారంటూ ఎక్స్‌ వేదికగా ఫైర్ అయ్యారు హరీష్ రావు. హైకోర్టు తీర్పు ప్రకారం అన్నిజీవోలను వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేయాలన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి లెక్క ప్రజల ముందు ఉంచాల్సిందే అన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. జీవోలు దాస్తున్నారంటే.. ఏదో తప్పు చేస్తున్నారనే అర్థం అన్నారు.ప్రభుత్వ జీవోలపై హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు TPCC చీఫ్‌ మహేష్‌కుమార్ గౌడ్. పదేళ్ల పాలనలో BRS ఎన్ని జీవోలు దాచిపెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. BRS పాలనలోనే ఒక్క జీవో కూడా బయటకు రాలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకంగా GOలు బయటపెడుతుందన్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదన్నారు కాంగ్రెస్ నేతలు