
ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాల భరతం పడుతున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దొంగల తాటతీస్తున్నారు. దొంగతనాలు జరిగిన వెంటనే అలర్ట్ అవుతున్న పోలీసులు టెక్నాలజీ సాయంతో గంటల వ్యవధిలో చోరీలను ఛేదిస్తున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో నాలుగు అంతరాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు.. 30 మందిపై కేసు నమోదవగా.. 22 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జూలై 17 జాబ్ ఫ్రాడ్ కేసు.. అదే రోజు నకిలీ ఆన్‌లైన్ లోన్ సైబర్ మోసం కేసు.. జూలై 18 అంతరాష్ట్ర బైక్ దొంగల కేసు.. జూలై 20 ఇంటి దొంగతనాల కేసు.. జూలై 21 ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాల కేసు.. జూలై 25 బ్యాంకుల వద్ద నగదు చోరీకి పాల్పడుతున్న కేసు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు వరుసగా పది రోజుల వ్యవధిలో ఇటు రైతులను అటు వ్యాపారులను బురిడి కొట్టిస్తూ జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆరు అంతరాష్ట్ర ముఠాల భరతం పట్టారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు..
ఈనెల 17 న ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని నమ్మించి ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న సైబర్ ముఠాను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు తిల్కర్ ఆకాశ్ ను అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా 11 సైబర్ ఫిర్యాదులు ఉండగా, 30 మందికి పైగా బాధితులను మోసం చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు ఎస్పీ అఖిల్ మహాజన్.. ఈనెల 20 న ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వరుస ఇళ్ల దొంగతనాల కేసులో నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి 36 గ్రాముల బంగారం, 25.5 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 21 న ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాల కేసును చేదించిన పోలీసులు.. మొత్తం 8 మంది నిందితులపై 10 కేసులు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి 100 కిలోల రాగి తీగ, రెండు వాహనాలు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన రాగిని కొనుగోలు చేసిన స్క్రాప్ షాపు యజమానులపై సైతం చర్యలు తీసుకున్నారు.
తాజాగా వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర బైక్ దొంగల ముఠాను పట్టుకున్నారు ఆదిలాబాద్ పోలీసులు. విరిగిన నంబరు ప్లేట్ ఆధారంగా పోలీసులు కూపీ లాగితే కొన్ని నెలలుగా ద్విచక్ర వాహనాలు, ఆటోలను చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఆదిలాబాద్ పోలీసులు. ఈ నెల 21న ముఠా సభ్యులు ఆదిలాబాద్ లో రిమ్స్ ఆటో చోరీకి యత్నించారు. వారిని పట్టుకోవటానికి ప్రత్యేకంగా 24న కుప్టి ఘాట్ వద్ద అర్ధరాత్రి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. అయిదుగురితో వెళ్తున్న ఓ కారును ఆపారు. అందులో నుంచి ఇద్దరు దిగి కత్తులతో చంపుతామని బెదిరిస్తూ.. హెచ్చరించి పరారయ్యారు. ఆ కారుకు విరిగిన నంబరు ప్లేటు ఉండటాన్ని గమనించిన పోలీసులు ఆ దిశలో దర్యాప్తు చేపట్టారు. అనంతరం 25న వాంకిడి చెకోపోస్టు వద్ద వాహనాలను తనిఖీలు చేస్తూ అదే కారును గుర్తించి అందులోని 5 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నిర్మల్ పట్టణానికి చెందిన ప్రధాన నిందితులు యాసర్, మొహ్మద్ అద్నాన్ అహ్మద్ అలియాస్ సోహెల్ వాహన డ్రైవర్లుగా పనిచేస్తూ ఒక కారును అద్దెకు తీసుకొని వాహనాల చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దొంగిలించిన వాహనాలను ముఠా సభ్యులైన ఇఫ్తెకర్, అబూతలాహ వద్ద ఉంచి విక్రయిస్తున్నట్టుగా తేల్చారు. ఈ కేసులో 16 మంది నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఆరుగురి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల వద్ద నుండి 7 బైక్ లు, 3 ఆటోలు, ఒకకారు , ఒక కత్తి , 8 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గత కొద్ది నెలలుగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలలో నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ముఠా ఆటలను ఆదిలాబాద్ పోలీసులు కట్టడి చేశారు. నిందితులంతా నిర్మల్ జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం..
Adilabad Police
మరో వైపు ఆదిలాబాద్ పట్టణంలో గత నెల ఐడీబీఐ బ్యాంక్ నుండి నగదు డ్రా చేసిన వ్యక్తిని వెంబడించి నేతాజీ చౌక్ సమీపంలో పార్క్ చేసిన స్కూటీ డిక్కీ పగులగొట్టి రూ.3 లక్షల నగదును అపహరించిన కేసును జిల్లా పోలీసులు చేధించారు. బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వారిని టార్గెట్ చేసి వెంబడించి స్కూటీలు, కార్ల డిక్కీలు పగులగొట్టి నగదు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ప్రధాన నిందితుడు శంకర్ ను అరెస్ట్ చేశారు. తన సహచరులతో కలిసి అంతరాష్ట్ర స్థాయిలో ముఠాగా ఏర్పడి బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు ఎస్పీఅఖిల్ మహాజన్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాలనీల్లో అవసరం అయితే ఇళ్లలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలను వీలైనంత వరకు కట్టడి చేయవచ్చని.. దొంగతనాలు జరిగినా వెంటనే దొంగలు పట్టుకునే అవకాశం ఉంటుందని కోరారు.