Adilabad: ప్రాజెక్ట్ మింగేసింది.. ఆత్మీయత మళ్లీ కలిపింది.. అపూర్వ వేడుకకు వేదికైన ఆదివాసీ గడ్డ

|

Feb 11, 2024 | 3:23 PM

ఆదిలాబాద్ జిల్లా అపూర్వ వేడుకకు వేదికైంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 40 ఏళ్ల క్రితం విడిపోయిన ఓ ఊరంతా ముచ్చటగా ఒక్క చోటకు చేరింది. నాలుగు దశాబ్దాల క్రితం చెట్టుకొకరు, పుట్టకొకరుగా విడిపోయిన వారంతా మళ్లీ సొంతూరుకు చేరి ఆ పాత స్మృతులను నెమరేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ అపూర్వ వేడుకకు ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పరిధిలోని పాత తోయగూడ వేదికైంది.

Adilabad: ప్రాజెక్ట్ మింగేసింది.. ఆత్మీయత మళ్లీ కలిపింది.. అపూర్వ వేడుకకు వేదికైన ఆదివాసీ గడ్డ
Satnala Project Inhabitants
Follow us on

ఆదిలాబాద్ జిల్లా అపూర్వ వేడుకకు వేదికైంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 40 ఏళ్ల క్రితం విడిపోయిన ఓ ఊరంతా ముచ్చటగా ఒక్క చోటకు చేరింది. నాలుగు దశాబ్దాల క్రితం చెట్టుకొకరు, పుట్టకొకరుగా విడిపోయిన వారంతా మళ్లీ సొంతూరుకు చేరి ఆ పాత స్మృతులను నెమరేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ అపూర్వ వేడుకకు ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పరిధిలోని పాత తోయగూడ వేదికైంది. 1984 లో సాత్నాల ప్రాజెక్ట్ నిర్మాణంతో పాత తోయిగూడ ముంపుకు గురవగా.. గ్రామస్తులంతా బతుకు దెరువుకు గూడు చెదిరిన పక్షుల్లా విడిపోయారు. అప్పుడు యువకులుగా ఊరు విడిచిన వారంతా ఇప్పుడు వృద్దులుగా ఒక్క చోటకి చేరడం.. కుటుంబాలతో కలిసి తమ ఊరును వెతుక్కుంటూ రావడం ఆ ప్రాంతాన్ని జాతరలా మార్చింది. ఊరు జ్ఞాపకాలని పిల్లలకు చెపుతూ సంబరపడిపోయారు ఆనాటి మిత్రులంతా.

పండుగను మించిన సంబురం.. ఆత్మీయ పలకరింపుల అంబరం

ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాత తోయగూడ గ్రామస్తులంతా మళ్లీ కలుసుకున్నారు. అలా ఇలా కాదు నాలుగు దశాబ్దాల తర్వాత సకుటుంబ సపరివార సమేతంగా కలుసుకున్నారు. నాడు సాత్నాల ప్రాజెక్టు ముంపు కారణంగా గూడు చెదిరి విడిపోయిన వారంతా నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ సొంతూరుకు చేరుకున్నారు. గత ఏడాది మొదటి సారి ఇదే రోజు అపూర్వ సమ్మేళనానికి కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చారు. ఆత్మీయ పలకరింపులు.. ఆలింగనాల ఆనాటి మదుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. రెండవ సారి మళ్లీ ఇదే రోజు ఆ చోటుకు చేరుకుని ఆ పాత మదురస్మృతులను గుర్తు చేసుకున్నారు. 40 ఏళ్ల క్రిత క్రితం చంటి పిల్లలుగా ఊరు విడిచిన వారంత 50 ఏళ్ల మధ్య వయసులో మళ్లీ పాత ఊరిలోకి అడుగు పెట్టగా.. యువకులుగా ఊరు విడిచిన వారంతా వృద్దులుగా ఊరు చేరుకుని‌ సంబురంగా కనిపించింది.

ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ.. సకుటుంబ సపరివారంగా..

గ్రామ శివారు ప్రాంతంలో బస చేసిన ఆనాటి పాత తోయగూడ వాసులంతా రోజంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. 1984 లోనే సాత్నాల ప్రాజెక్ట్ ముంపు కింద పాత తోయగూడ మునిగి పోగా.. కొత్త ఊరు రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటైనా మూడు నాలుగు కుటుంబాలే అక్కడికి వెళ్లాయి. మిగిలిన 50 కి పైగా కుటుంబాలు ఉపాధి వెతుకుంటూ బతుకు దెరువు కోసం చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోక తప్పలేదు.

సరిగ్గా 39 ఏళ్ల తర్వాత అంతా పాత ఊరిని చూడాలని కలగనడం.. మూడు నెలలు కష్టపడి అందరిని ఒక్క చోటుకి చేర్చి ఇలా ప్రతి ఏడాది పండుగ జరుపుకోవాలని గత ఏడాది ఆత్మీయ‌ సమ్మేళనంలో తీర్మనించుకున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా సకుటుంబ సపరివార సమేతంగా రెండవ ఏడాది మర్చిపోకుండా అపూర్వ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆనాటి గ్రామ పంచాయితీ కార్యాలయ భవనం , పెద్దమోట బావి , హనుమండ్లపార , భేతాళ గుట్టను దర్శించుకుని ఆ పాత మదుర జ్ఞాపకాలను‌ నెమరు వేసుకున్నారు. తోయగూడ ఆత్మీయుల పేరిట వాట్సాప్ ప్యామిలీ గ్రూప్ ను క్రియేట్ చేసుకుని అందులో మంచి చెడులను చర్చిస్తూ.. ఎవరికి ఏ కష్టం వచ్చిన అండగా ఉండాలని.. ఆత్మీయులుగా కలకాలం ఇలాగే సాగాలని నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…