
తన కళ్ల ఎదుటే పచ్చని పంట ఎండిపోతుంటే తట్టుకోలేకపోయని ఓ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేసిన అప్పులు తీరే దారి కనిపించలేదు. పంటకు సాగునీరు అందక మనస్తాపంతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. రైతు మృతితో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.
అతనో సామాన్య రైతు.. ఉన్న రెండెకరాల భూమే అతనికి సర్వస్వం.. ఆ భూమిని నమ్ముకునే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దుబ్బాక మండలం రఘుత్తంపల్లి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి మోహన్ రెడ్డి. ఈ యాసంగి సీజన్‌లో తనకు ఉన్న భూమిలో ఆశగా వరి సాగు చేశాడు. కానీ ప్రకృతి కన్నెర్ర చేసింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగునీరు అందక వరి పొలం ఎండిపోవడం మొదలైంది. ఎండిపోతున్న వరి పంటను చూసి తట్టుకోలేకపోయిన మోహన్ రెడ్డి, ఎలాగైనా సాగు నీరు అందించి పంటను కాపాడుకోవాలని తెగించి అప్పు చేశాడు. వేల రూపాయలు వెచ్చించి బోరు వేయించాడు.
కానీ విధి వంచించింది. ఆ బోరులో చుక్క నీరు పడలేదు. దీనితో అటు పెట్టిన పెట్టుబడి రాక, ఇటు చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మోహన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కళ్ల ముందే పంట ఎండిపోతుంటే, చూసి తట్టుకోలేక ఆవేదనతో పొలం వద్దే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మోహన్ రెడ్డి మరణంతో రఘుత్తంపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి ఇద్దరు చిన్నారి కూతుళ్లు ఉన్నారు. తండ్రి మరణంతో ఆ పసిపిల్లలు అనాథలయ్యారు. అప్పుల బాధతో తండ్రిని కోల్పోయిన ఆ కుటుంబాన్ని చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆపదలో ఉన్న మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..