
గేదె వివాదం వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది.. ఇద్దరి వ్యక్తులు మధ్య గేదె వివాదం ఘర్షణకు దారి తీసింది. చివరికి కర్రలతో కొట్టుకున్నారు. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం చౌడారం వద్ద రాజుగూడెం గ్రామంలో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రాజుగూడెం గ్రామానికి చెందిన మార్కపూడి వెంకట్రావు (50), బొల్లిపోగు వెంకటేశ్వరరావు ల మధ్య ఇంటి ముందు కట్టేసిన గేదెల విషయమై ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో వాగ్వాదం తీవ్రస్థాయికి చేరగా, బొల్లిపోగు వెంకటేశ్వరరావు కర్రతో మార్కపూడి వెంకట్రావుపై దాడికి తెగబడ్డాడు. వెంకట్రావు గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుడు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు అతన్ని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
దాడిలో బయటకు కనపడని దెబ్బలకు చికిత్స పొందుతూ వెంకట్రావు మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకట్రావు మృతి చెందినప్పటికీ పోలీసులకు ఎలాంటి పిర్యాదు అందలేదని, ప్రాధమిక దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్తి లింగం తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..