డీజేలు లేవు, ఆర్భాటం లేదు.. స్వచ్చమైన భక్తి, భజనతో 80 ఏళ్లుగా ఏకదంతుడికి పూజలు!

డీజేల హోరు లేదు.. లేజర్ లైట్ల జిలుగులు లేవు.. ఉన్నదల్లా కేవలం అచ్చమైన భక్తి, తరతరాల సంప్రదాయం! బ్రిటీష్ కాలం నుంచి నేటి వరకు 80 ఏళ్లుగా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, చక్రి భజనలతోనే గణనాథుడికి సేవలు చేస్తూ.. నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు సిద్దిపేట జిల్లా కొడకండ్ల గ్రామస్తులు.

డీజేలు లేవు, ఆర్భాటం లేదు.. స్వచ్చమైన భక్తి, భజనతో 80 ఏళ్లుగా ఏకదంతుడికి పూజలు!
Gajwel Mandal Festivals

Edited By:

Updated on: Sep 19, 2026 | 3:22 PM

ఆధునిక కాలంలో వినాయక చవితి వేడుకలంటేనే పెద్ద పెద్ద డీజేలు, రంగురంగుల విద్యుత్ దీపాలు, మిరుమిట్లు గొలిపే హంగులు గుర్తుకొస్తాయి. కానీ, సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలోని ఏకదంతుడి వేడుకలు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా,కేవలం భక్తిశ్రద్ధలు, సంప్రదాయ భజనలతో ఇక్కడి గణనాథుడి నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. అయితే ఈ ఏడాది ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది.. అదే కొడకండ్ల గణపతి ఉత్సవాలకు 80 ఏళ్లు నిండడం.

బ్రిటీష్, నిజాం కాలం నాటి చరిత్ర

బ్రిటీష్, నిజాం పాలనా కాలం నుంచే కొడకండ్ల గ్రామంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తూ వస్తున్నారు. తరాలు మారినా, ఇక్కడి ప్రజలు తమ పూర్వీకులు ప్రారంభించిన సంప్రదాయాన్ని ఏమాత్రం విస్మరించలేదు. తొమ్మిది రోజుల పాటు అత్యంత నిష్ఠతో, భక్తిభావంతో స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘చక్రి భజన’ఈ గ్రామ ఉత్సవాల్లో అత్యంత ప్రధాన ఆకర్షణ. ఇక్కడ నిర్వహించే భజనలకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది.

గణేశ్ నవరాత్రుల సందర్భంగా గ్రామ యువకులు కాళ్లకు గజ్జె కట్టి, చక్రి భజన చేస్తుంటే చూడటానికి రెండు కళ్లు సరిపోవు. యువకుల నృత్య రీతులు, భక్తి కీర్తనలు భక్తులను ఎంతగానో పరవశింపజేస్తాయి.నాటి సీఎం చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక అవార్డు ఇక్కడి సంప్రదాయ కళకు దక్కిన గౌరవం సామాన్యమైనది కాదు. గ్రామానికి చెందిన సీతారామ భజన మండలి ప్రదర్శించిన ఉత్తమ ప్రదర్శనకు గానూ.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతుల మీదుగా ఈ మండలి ప్రతిష్ఠాత్మక నటరాజస్వామి వెండి మెమోంటోను బహుమతిగా అందుకుంది.

ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కొడకండ్ల వినాయక నవరాత్రులు.. నేటి తరానికి భారతీయ సంస్కృతిని, భక్తి సంప్రదాయాలను చాటిచెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ.

Loading...
Unable to load recommendations.
Follow Us