
కొందరికి జంతువులు, పక్షులు అంటే అమితమైన ప్రేమ ఉంటుంది.. అందుకే తమ ఇంట్లో కుక్కలు , పక్షులు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను ఎక్కువగా పెంచుకోవడానికి ఇష్టపడుతారు. వాటిపై మమకారం చూపిస్తూ అపురూపంగా చూసుకుంటారు. కొన్ని కుటుంబాల్లో అయితే ఇంట్లో మనిషుల్లా కలిసిపోతాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇలాంటి సీనే కనిపించింది. ఓ కోడిపుంజు ఆ కుటుంబంలో ఓ సభ్యురాలు అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో నివసిస్తున్న చెన్ను ప్రవీణ్, శైలజ దంపతులు వద్ద ఓ కోడి పుంజు ఉంది. అయితే సాధారణంగా ఒక కోడిపుంజు ఐదు నుంచి పది సంవత్సరాల వరకు జీవిస్తుంది. కానీ వీళ్లు మాత్రం ఓ నాటు కోడి పుంజును 16 ఏళ్లుగా పెంచుతున్నారు.
దీనిపై యజమాని ప్రవీణ్ మాట్లాడుతూ.. తన కుమార్తెకు రెండేళ్లున్నప్పటి నుంచి ఈ కోడిపుంజును పెంచుతున్నానని, దానికి తోడు ఒక రెండు సంవత్సరాల నుండి లియో అనే పేరుతో జాతి కుక్కని కూడా పెంచుతున్నానని తెలిపారు. అవి రెండు స్నేహంగా ఇంట్లో కలియ తిరుగుతూ ఉంటాయని తెలిపాడు. ఎండాకాలం కావడంతో ఈ రెండు జీవులు కూలర్ కింద పడుకొని స్నేహభావంతో ఆడుకుంటాయని ప్రవీణ్ తెలిపారు.
తాము పెంచుతన్న కోడి పుంజు పేరు టింకూ అని.. ప్రస్తుతం దాని వయసు 16 ఏళ్లని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ కోడి పుంజూ తమ కుటుంబంలో ఓ భాగమైపోయిందని తెలిపారు. అయితే ఆ పుంజు కేవలం సజ్జలు మాత్రమే తింటుందని.. ఇంకా రెండు సంవత్సరాలు దాని పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రవీణ్ బాధతో వివరించారు. కాగా, నాణ్యమైన ఆహారం, సరైన సంరక్షణ ఉంటే కోడిపుంజులు పదిహేనేళ్ల వరకు జీవించే అవకాశం ఉందని జిల్లా పశువైద్య శాఖ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.