AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..

ఊళ్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటేనే గొప్పగా చెబుతారు. మరీ, ఊరినిండా ఉద్యోగులే ఉంటే. ఇంటింటికో‌ ఉద్యోగి ఉంటే.. మీరు వింటున్నది నిజమే. ఆ ఊరిలో ప్రతీ గడప గడపకో ఓ ఉద్యోగి చొప్పున ఏకంగా 310 మంది ప్రభుత్వ ఉద్యోగాలను‌ సాదించారు. ఓ కుటుంబంలో అయితే ఏకంగా ఏడుగురు ప్రభుత్వ విధుల్లో కొనసాగుతుండడం గమనార్హం. ఇంత ప్రత్యేకత సంతరించుకున్న ఆ గ్రామం ఎక్కడో తెలుసుకోవాలంటే అడవుల జిల్లా ఆదిలాబాద్‌కు వెళ్లాల్సిందే‌.

Telangana: ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
The Inspiring Story Of Venkatapur Village
Naresh Gollana
| Edited By: |

Updated on: Aug 23, 2026 | 2:10 PM

Share

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వెంకటాపూర్ గ్రామం. ఆ గ్రామంలో ఉన్నవి 120 ఇళ్లు.. జనాభా 684.. సర్కారు ఉద్యోగులు మాత్రం ఏకంగా 310 మంది. ఈ గణాంకాలు చాలు, వారు ఎంత చైతన్యంతో ముందుకు సాగుతున్నారో చెప్పడానికి. ఆ మారుమూల గ్రామం ఏ స్థాయిలో విద్యకి ప్రాదాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు కనీసం రహదారి మార్గం కూడా లేని గ్రామం ఇది‌. నేరడిగొండ మండల కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరాన అటవీప్రాంతంలో ఉంటుంది ఈ గ్రామం. గ్రామస్తులంతా దాదాపు రైతులే. మండల కేంద్రానికి వెళ్లాలంటే కాలినడకే దిక్కు.. అత్యవసరం అయితే గతుకుల రోడ్డులో ఎడ్ల బండిపై గంట ప్రయాణం చేస్తే తప్ప మండల కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి. కానీ ఓ ఉపాద్యాయుడి స్పూర్తితో ఆ ఊరి తలరాతే మారిపోయింది. ఆయన చూపిన బాటలో నడిచిన ఆ గ్రామం ఇప్పుడు మండల కేంద్రానికే తలమానికంగా నిలిచింది.

1969లో రూపావత్ బనియా(బలిరాం) అనే వ్యక్తి మొదటగా ఈ గ్రామం నుండి సర్కారు కొలువు సాధించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఆయన స్ఫూర్తితో మొదలైన ప్రస్థానం ఇదిగో ఇలా ప్రభుత్వ ఉద్యోగాల పల్లెగా నిలిచింది. 1969 లో ఈ ఊరిలో 50 కుటుంబాల వరకు ఉండగా అందరూ నిరాక్షరాస్యులే. ఆ సమయంలో ఉపాద్యాయ ఉద్యోగం సాధించి బనియా.. సమీప గ్రామంలోనే టీచర్ భాద్యతలు చేపట్టడంతో వెంకటపూర్ తలరాత మారిపోయింది. తన గ్రామంలో మార్పు తీసుకురావాలని తోటి యువకులను విద్య వైపు ప్రోత్సహించాడు. తన సంతానాన్ని సైతం ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ముందుకు నడిపాడు. ఆయన అనుకున్నట్టుగా తమ వారసులు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు‌ సాదించారు. అంతే కాదు ఆ ముగ్గురు మరో ముగ్గురిని.. వారు మరో ముగ్గురిని ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇరవై ఏళ్ల కాలంలో 50 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను‌ సాదించి భళా అనిపించారు. అక్కడితోనే ఆగిపోలేదు ఆ ఊరు విజయ దుందుభి.. ఏకంగా గ్రామ జనాభాలో సగం మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేంత వరకు సాగింది ప్రయాణం. వీరిలో ఎక్కువగా ఉపాధ్యాయులే ఉన్నారు. తర్వాత స్థానాల్లో రెవెన్యూ, పోలీస్, బ్యాంకు, అటవీశాఖ, పంచాయతీరాజ్, రైల్వే, ఆర్ డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్, వ్యవసాయశాఖ, ఎక్సైజ్, ఐసీడీఎస్, హౌసింగ్, ట్రాన్స్కో, జేన్కో, భూగర్భజల, హాస్టల్ వెల్ఫేర్, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక తదితర శాఖల్లో సేవలందిస్తున్నారు.

ప్రస్తుతం గ్రామ జనాభా 684 మంది ఉండగా అందులో 310 మంది పురుషులు.. 320 మంది మహిళలు.. అందులోను 100 మంది ఆడపడుచులు ప్రభుత్వ ఉద్యోగాలను సాదించి భళా అనిపించుకున్నారు. ఇందులో పెళ్లిలై అత్తారింటికి వెళ్లిన వారు ఓ 90 మంది కాగా.. ప్రస్తుతం వీరంతా తమ అత్తగారి ఇళ్లలో స్థిరపడ్డారు. వీరిలో 80 మంది ప్రభుత్వ ఉపాధ్యాయురాళ్లు కాగా మిగిలిన వారంతా రెవెన్యూ , ఇరిగేషన్ శాఖల్లో స్థిరపడ్డారు. ఈ గ్రామానికి కోడల్లుగా వచ్చిన 50 మంది పైగా ప్రభుత్వ ఉపాద్యాయులు కావడం విశేషం.

Follow Us