
ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి కళ్లు మూసేంత వరకు.. మన అరచేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ నుంచి ఒక్క క్షణం కూడా డిస్‌కనెక్ట్ కాలేని రోజులివి. అలాంటిది విమానం ఎక్కగానే ఎయిర్‌హోస్టెస్ నుంచి వినిపించే మొదటి అనౌన్స్‌మెంట్.. ‘‘దయచేసి మీ మొబైల్ ఫోన్లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టండి లేదా స్విచ్ఛాఫ్ చేయండి’’ అని.. దీంతో వెంటనే స్క్రీన్ అంతా ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తారు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి.. ఆ ఒక్క క్లిక్‌తో మీ ఫోన్ లోపల నిజంగా ఏం ఆగిపోతుంది? ఇది కేవలం విమానాల భద్రత కోసమేనా లేక మన ఆరోగ్యానికి, మనశ్శాంతికి కూడా అవసరమా?
సాధారణంగా స్మార్ట్‌ఫోన్ అనేది నిరంతరం రేడియో తరంగాలను పంపుతూ, స్వీకరిస్తూ ఉండే ఒక ట్రాన్స్‌సీవర్. మీరు ఫ్లైట్ మోడ్ ఆన్ చేయగానే.. ఫోన్‌లోని సెల్యులార్ ట్రాన్స్‌మిటర్ పూర్తిగా నిద్రపోతుంది. అంటే కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, మొబైల్ డేటా పూర్తిగా నిలిచిపోతాయి. నేలపై ఉన్నప్పుడు మీ ఫోన్ సమీపంలోని టవర్ నుంచి సిగ్నల్ అందుకుంటుంది. కానీ విమానం 30,000 అడుగుల ఎత్తులో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు ఫోన్ కింద ఉన్న టవర్ల కోసం అత్యధిక బ్యాటరీ పవర్ ఉపయోగించి నిరంతరం హలో.. సిగ్నల్ ఉందా? అంటూ రేడియో సిగ్నల్స్ విసురుతూనే ఉంటుంది. ఫ్లైట్ మోడ్ ఈ రేడియో వికిరణాన్ని వెంటనే ఆపేస్తుంది. అయితే ఆధునిక ఫ్లైట్లలో ఇన్‌ఫ్లైట్ వైఫై వాడుకోవడానికి ఫ్లైట్ మోడ్ ఆన్‌లో ఉంచి కూడా వైఫై, బ్లూటూత్‌లను మాన్యువల్‌గా ఆన్ చేసుకునే సదుపాయం ఇప్పుడు అందుబాటులో ఉంది.
చాలామందికి ఉండే అతిపెద్ద సందేహం ఇదే. నిజానికి ఫోన్ ఆన్‌లో ఉంచితే విమానం కూలిపోదు. కానీ అంతకంటే విసుగెత్తించే సమస్య ఒకటి వస్తుంది. మీరు ఎప్పుడైనా మైక్ లేదా ఆడియో స్పీకర్ పక్కన ఫోన్ మాట్లాడినప్పుడు “టిక్.. టిక్.. టిక్..” లేదా “కిర్ర్ర్” అని ఒక వింత శబ్దం విన్నారా? సరిగ్గా పైలట్లకు కూడా అదే జరుగుతుంది. ఫ్లైట్ మోడ్ పెట్టని వందల ఫోన్లు ఒకేసారి నేలపై ఉన్న టవర్ల కోసం సిగ్నల్స్ వెతుకుతున్నప్పుడు, ఆ రేడియో తరంగాలు పైలట్ హెడ్‌సెట్‌లలో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ సిస్టమ్‌లో తీవ్రమైన బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను, అంతరాయాన్ని సృష్టిస్తాయి. అత్యంత సున్నితమైన ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో పైలట్‌కు కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే కీలకమైన సూచనలు స్పష్టంగా వినపడకపోతే ఎంత ప్రమాదమో ఊహించండి! ఆ చిన్న గందరగోళాన్ని నివారించడానికే ఈ నిబంధన.
ఫ్లైట్ మోడ్ కేవలం గగనవిహారానికి మాత్రమే కాదు.. రోజువారీ జీవితంలో మన ఫోన్‌ను, మన మైండ్‌ను రీసెట్ చేయడానికి కూడా ఒక అద్భుతమైన టూల్..
సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్: మీకు ఎక్కడికైనా వెళ్లడానికి కేవలం పది నిమిషాలే సమయం ఉందా? ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టి ఛార్జింగ్ పెట్టండి. బ్యాక్‌గ్రౌండ్‌లో నెట్‌వర్క్ వెతికే పని ఉండదు కాబట్టి బ్యాటరీ రెట్టింపు వేగంతో నిండుతుంది.
సిగ్నల్ మొరాయిస్తే బ్రహ్మాండమైన రీసెట్: నెట్‌వర్క్ లేదా డేటా సరిగ్గా రానప్పుడు ఫోన్ రీస్టార్ట్ చేయాల్సిన పనిలేదు. ఒకసారి ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఐదు సెకన్ల తర్వాత ఆఫ్ చేస్తే ఫోన్ సరికొత్తగా సమీపంలోని బలమైన టవర్‌తో కనెక్ట్ అవుతుంది.
రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర: అర్ధరాత్రి వచ్చే అనవసర ప్రమోషనల్ మెసేజ్‌లు, వాట్సాప్ పింగ్‌లు మీ నిద్రను పాడుచేయకుండా ఉండాలంటే అలారం పెట్టుకుని ఫ్లైట్ మోడ్ ఆన్ చేయండి. అలారం ఎంచక్కా మోగుతుంది, మీ నిద్రా భంగం కాదు.
మనం ఎప్పుడైనా గమనించామా? ఫ్లైట్ మోడ్ ఆన్ చేసినప్పుడు ఆగిపోయేది కేవలం సిగ్నల్స్ మాత్రమే కాదు.. క్షణం తీరిక లేకుండా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసే నోటిఫికేషన్లు, మెసేజ్‌లు, సోషల్ మీడియా ఒత్తిడి. ఆ చిన్న విమానం గుర్తుపై ట్యాప్ చేసిన క్షణం.. ప్రపంచం నుంచి మనం ఒక్కసారిగా డిస్‌కనెక్ట్ అయి, మన పక్కనున్న మనుషులతో, మనతో మనం కనెక్ట్ అవ్వడానికి ఒక చిన్న విరామం దొరుకుతుంది