Vodafone Idea: దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసం జరుగుతున్న ట్రయల్స్‌లో ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా సరికొత్త రికార్డు సృష్టించింది. వొడాఫోన్ ఐడియా(వీఐ) పూణేలో నిర్వహిస్తున్న 5జీ ట్రయల్స్ సమయంలో 3.7 జీబీపీ వేగంతో డేటాను బదిలీ చేసినట్లు సంస్థ వెల్లడించింది. గాంధీనగర్, పూణేలో కేటాయించిన మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌లో నిర్వహించిన ట్రయల్స్‌లో 1.5 జీబీపీ వరకు గరిష్ఠ డౌన్ లోడ్ వేగాన్ని అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్ 5జీ స్పీడ్ కంటే వీఐ డౌన్ లోడ్ స్పీడ్ ఎక్కువ. పూణే (మహారాష్ట్ర), గాంధీనగర్(గుజరాత్)లో ప్రభుత్వం కేటాయించిన 5జీ స్పెక్ట్రమ్ లో కంపెనీ తన టెక్నాలజీ విక్రేతలతో కలిసి 5జీ ట్రయల్స్ నిర్వహిస్తోంది. టెలికమ్యూనికేషన్స్ విభాగం 5జీ నెట్ వర్క్ ట్రయల్స్ కోసం సాంప్రదాయక 3.5 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌తో పాటు 26 గిగాహెర్ట్జ్ వంటి హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను డీఓటీ కేటాయించింది.
5జీ ట్రయల్స్ కోసం రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా చేసుకున్న దరఖాస్తులను మేలో డీఓటీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 5జీ ట్రయల్స్ కోసం ఎరిక్సన్, నోకియా, శామ్ సంగ్, సీ-డీఓటీలతో ఆరు నెలల ట్రయల్స్ కోసం అనుమతి మంజూరు చేసింది. జూన్ నెలలో జియో 1 జీబీపీల గరిష్ట వేగాన్ని నమోదు చేసిందని, జూలైలో ఎయిర్ టెల్ 1.2జీబీపీ గరిష్ట వేగాన్ని నమోదు చేసిందని డీఓటీ తెలిపింది. టెలికామ్ కంపెనీలు అన్నీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందించడం కోసం రెడీ అవుతున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ ఇంకా భారతదేశం అంతటా 4జీని విడుదల చేయలేదు.