ఎలాన్ మస్క్.. ప్రపంచానికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచకుబేరుడిగానే కాకుండా గొప్ప వ్యాపారవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మస్క్ ఏది చేసినా సంచలనమే. ఇప్పటికే పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన మస్క్.. తాజాగా స్మార్ట్‌ఫోన్ రంగంలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. టెస్లా కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్ వస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి టెస్లా స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్‌ను వచ్చే డిసెంబర్‌లో లాంచ్ చేయనున్నారని సమాచారం. ఇంతకీ టెస్లా నుంచి వచ్చే ఫోన్ పేరు ఏంటి? ఫీచర్లు ఎలా ఉండనున్నాయి లాంటి వివరాలు మీకోసం. టెస్లా కంపెనీకి చెందిన ఈ ఫోన్‌ను పైఫోన్ పేరుతో లాంచ్ చేయనున్నారు. తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇస్తున్నారు. దీనికి ఒలియోఫోబిక్ కోటింగ్‌తో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలు ఉండనున్నాయి.
వెనకాల వైపు మూడు 50 ఎంపీ కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. ముందుభాగంలో 40 ఎంపీ పంచ్‌హోల్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్న ఈఫోన్ ధర రూ. 70 వేల నుంచి రూ. 80 వేల వరకు ఉండొచ్చని అంచనా. ఇక టెస్లా ఇందుకోసం ప్రత్యేకంగా ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీసుకొస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..