
ఈ ప్రత్యేక ప్యాకేజింగ్ మాంసాన్ని తెరవకుండానే దాని తాజాదనంపై ఒక విజువల్ సూచన ఇస్తుంది. మాంసం పాడయ్యే ప్రక్రియలో ఏర్పడే రసాయన మార్పులను గుర్తించి.. ఫిల్మ్ పర్పుల్-రెడ్ నుంచి ఎల్లో-గ్రీన్ రంగులోకి మారుతుంది. అంతేకాదు.. ప్యాకేజింగ్‌కు చిన్న కోతలు పడినా వాటిని తానే సరిచేసుకునే లక్షణం కూడా ఈ పదార్థానికి ఉండటం విశేషం.
1. మాంసం పాడైతే ప్యాకెట్ రంగు ఎందుకు మారుతుంది?
తాజా మాంసం స్వల్పంగా ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. బ్యాక్టీరియా పెరుగుతూ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసినప్పుడు ఆల్కలైన్ సమ్మేళనాలు, వాయువులు విడుదలవుతాయి. దీంతో ప్యాకెట్‌లోని pH స్థాయి క్రమంగా పెరుగుతుంది. ఈ రసాయన మార్పునే కొత్త స్మార్ట్ ఫిల్మ్ గుర్తిస్తుంది.
2. పర్పుల్ నుంచి ఎల్లో-గ్రీన్‌కు మారుతుంది
ఈ స్మార్ట్ ఫిల్మ్‌లో ఆంథోసయానిన్ అనే సహజ వర్ణద్రవ్యం ఉపయోగించారు. ఇది పర్పుల్ స్వీట్ పొటాటో, ఎర్ర క్యాబేజీ వంటి వాటిలో సహజంగా లభిస్తుంది. pH మార్పులకు స్పందించే లక్షణం దీనికి ఉంటుంది. మాంసం పాడయ్యే కొద్దీ ఫిల్మ్ పర్పుల్-రెడ్ నుంచి ఎల్లో-గ్రీన్‌గా మారుతుంది. ప్రత్యేక పరికరం అవసరం లేకుండానే ఈ రంగు మార్పును కళ్లతో చూడవచ్చు.
3. ప్యాకెట్ తెరవకుండానే తాజాదనం తెలుసుకోవచ్చు
ప్రస్తుతం మాంసం తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి ప్యాకెట్ తెరిచి వాసన చూడటం లేదా రంగు, ఆకృతిని పరిశీలించడం సాధారణ పద్ధతి. అయితే ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ప్యాకెట్‌ను తెరవకుండానే దాని రంగును చూసి మాంసం పరిస్థితిపై ప్రాథమిక అంచనా వేసే అవకాశం ఉంటుంది.
4. ఆంథోసయానిన్‌కు రక్షణగా ప్రత్యేక పదార్థం
ఆంథోసయానిన్ సహజమైనదే అయినప్పటికీ వేడి, వెలుతురు, ఆక్సిజన్ ప్రభావంతో దాని రంగు మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల తప్పుడు సంకేతాలు వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని అధిగమించేందుకు పరిశోధకులు ఆంథోసయానిన్‌ను UiO-66-NH₂ అనే మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ (MOF)తో కలిపారు. ఇది వర్ణద్రవ్యాన్ని రక్షిస్తూనే pH మార్పులకు స్పందించేలా చేస్తుంది.
5. పంది మాంసంపై ప్రయోగాలు చేశారు
పంది మాంసంపై నిర్వహించిన పరీక్షల్లో మాంసం పాడవుతున్న కొద్దీ ఫిల్మ్ దశలవారీగా రంగు మార్చినట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు, సాధారణ నమూనాలతో పోలిస్తే ఈ హైడ్రోజెల్ ప్యాకేజింగ్ పంది మాంసం నిల్వ కాలాన్ని సుమారు 12 గంటల వరకు పెంచినట్లు పరిశోధనలో వెల్లడైంది.
6. ప్యాకేజింగ్‌కు కోత పడినా తానే సరిచేసుకుంటుంది
ఈ స్మార్ట్ ప్యాకేజింగ్‌లో మరో ఆసక్తికరమైన ప్రత్యేకత ఉంది. ఫిల్మ్‌కు చిన్న కోత పడినప్పుడు దెబ్బతిన్న భాగాలను తిరిగి కలిపితే కొన్ని నిమిషాల్లో ఆ గాయం కనిపించకుండా పోయింది. రెండు గంటల్లో దాని టెన్సైల్ స్ట్రెంగ్త్ సుమారు 99 శాతానికి తిరిగి వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు.
7. త్వరలో మొబైల్ యాప్ కూడా రావచ్చట
ఈ టెక్నాలజీని మరింత ఉపయోగకరంగా మార్చేందుకు పరిశోధకులు స్మార్ట్‌ఫోన్ యాప్‌పై కూడా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఆహార తయారీదారులు, రవాణా సంస్థలు, వినియోగదారులు ఆహారం తాజాదనాన్ని రియల్‌టైమ్‌లో అంచనా వేసేందుకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.
గమనిక:
ఇది క్యుషూ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక స్మార్ట్ ప్యాకేజింగ్ టెక్నాలజీ. ప్రస్తుతం ప్రతి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సాధారణ ప్యాకేజింగ్ ప్రత్యామ్నాయం కాదు. పరిశోధనలో లభించిన ఫలితాలను ఆధారంగా చేసుకుని భవిష్యత్ వినియోగ అవకాశాలను పరిశీలిస్తున్నారు.