RO వాటర్‌ తాగితే ఆరోగ్యానికి డేంజరా? అసలు మ్యాటర్‌ ఇదే!

ఈ కాలంలో RO వాటర్ ప్యూరిఫైయర్‌లు చాలా ఇళ్లలో సర్వసాధారణం. ఇవి నీటిలోని హానికరమైన మలినాలను సమర్థవంతంగా తొలగిస్తాయి. RO నీటితో శరీరానికి అవసరమైన ఖనిజాలు తగ్గిపోతాయా అనే సందేహంపై నిపుణులు స్పష్టతనిచ్చారు. శుభ్రమైన నీరు, సరైన ఆహారం, ప్యూరిఫైయర్ నిర్వహణే ముఖ్యం.

RO వాటర్‌ తాగితే ఆరోగ్యానికి డేంజరా? అసలు మ్యాటర్‌ ఇదే!
Ro Water

Updated on: Mar 10, 2026 | 3:43 PM

ఈ కాలంలో వాటర్ ప్యూరిఫైయర్ దాదాపు అందరి ఇళ్లలో ఉంటోంది. ఫ్రిజ్, గ్యాస్ స్టవ్ లాగా అది కూడా ఒక కచ్చితమైన ఉపకరణంగా మారింది. ముఖ్యంగా రివర్స్ ఓస్మోసిస్ (RO) టెక్నాలజీ ఉన్న ప్యూరిఫైయర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇవి నీటిలోని బ్యాక్టీరియా, వైరస్‌లు, భారీ లోహాలు, కరిగిన లవణాలు వంటి హానికరమైన మలినాలను తొలగించి తాగడానికి సురక్షితంగా చేస్తాయి. అయితే RO నీరు తాగితే శరీరానికి అవసరమైన ఖనిజాలు తగ్గిపోతాయా అనే సందేహం చాలామందిలో ఉంది. నిపుణుల ప్రకారం RO వడపోత సమయంలో కాల్షియం, మెగ్నీషియం వంటి కొన్ని సహజ ఖనిజాలు తగ్గడం నిజమే. కానీ దీని వల్ల సాధారణంగా ఆరోగ్యానికి పెద్దగా సమస్యలు రావు. ఎందుకంటే మన శరీరానికి అవసరమైన ఖనిజాల్లో చాలా భాగం తాగే నీటితో కాకుండా ఆహారం ద్వారా లభిస్తాయి. సమతుల్యమైన, పోషకాహారం తీసుకునే వ్యక్తుల్లో ఖనిజ లోపాలు రావడం చాలా అరుదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

క్లినికల్ న్యూట్రిషనిస్ట్‌ల ప్రకారం పాలు, పెరుగు, పనీర్, రాగులు, నువ్వులు, బాదం వంటి ఆహారాల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. గుమ్మడికాయ గింజలు, జీడిపప్పు, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి ఆహారాలు మెగ్నీషియంను అందిస్తాయి. అలాగే అరటిపండ్లు, కొబ్బరి నీళ్లు, పప్పులు, ఆకుకూరలు పొటాషియం సమృద్ధిగా అందిస్తాయి. ఈ ఆహారాలను రోజువారీ భోజనంలో చేర్చుకుంటే శరీరానికి అవసరమైన ఖనిజాలు సులభంగా లభిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యంపై కూడా RO నీటి ప్రభావం పెద్దగా ఉండదని నెఫ్రాలజిస్టులు చెబుతున్నారు. శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కిడ్నీలు, హార్మోన్లు, ఆహారం కలిసి నియంత్రిస్తాయి. కాబట్టి శుభ్రమైన RO నీటిని తాగడం వల్ల ఆరోగ్యవంతులలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత సాధారణంగా ఏర్పడదు.

ఇప్పటికే మార్కెట్లో కొన్ని ఆధునిక ప్యూరిఫైయర్లు రీమినరలైజేషన్ టెక్నాలజీతో వస్తున్నాయి. ఇవి శుద్ధి చేసిన నీటిలో కొంత కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను తిరిగి కలుపుతాయి. ఇది నీటి రుచిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మొత్తానికి నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన విధంగా నిర్వహించిన RO ప్యూరిఫైయర్ నీటిని తాగడం వల్ల పెద్ద ఆరోగ్య సమస్యలు రావు. ఖనిజాల గురించి ఆందోళన చెందడం కంటే సమతుల్య ఆహారం తీసుకోవడం, శుభ్రమైన నీటిని తాగడం, ప్యూరిఫైయర్‌ను సరిగ్గా నిర్వహించడం ముఖ్యమని వారు సూచిస్తున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us