మతిపోగొట్టే ఫీచర్లతో వస్తున్న ఐఫోన్ 18 ప్రో! ఇక DSLR కెమెరాను తలదన్నేలా..
యాపిల్ ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌లో కెమెరా అప్‌గ్రేడ్‌లు రాబోతున్నాయి. కొత్త 48MP సెన్సార్, త్రీ-లేయర్ స్టాక్డ్ డిజైన్, వేరియబుల్ అపెర్చర్ వంటి DSLR తరహా ఫీచర్లు లో-లైట్ ఫోటోగ్రఫీ, డెప్త్‌ను మెరుగుపరుస్తాయి. శాంసంగ్‌తో కలిసి కస్టమ్ సెన్సార్ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం యాపిల్ నుంచి రానున్న ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లపై ఆసక్తికరమైన లీకులు వెలువడుతున్నాయి. ఈసారి కంపెనీ ఫోటోగ్రఫీ సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. కొత్త కెమెరా టెక్నాలజీలు, DSLR తరహా ఫీచర్లు వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించనున్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. నివేదికల ప్రకారం ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో కొత్త 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను అందించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సోని సెన్సార్లను ఉపయోగిస్తున్న ఆపిల్, ఈసారి శాంసంగ్‌తో కలిసి కస్టమ్ సెన్సార్‌ను అభివృద్ధి చేస్తోందని ప్రచారం జరుగుతోంది.
త్రీ లేయర్ స్టాక్డ్ డిజైన్‌తో ఉండే ఈ సెన్సార్, కాంతిని ఎక్కువగా గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉండి, ముఖ్యంగా లో-లైట్ ఫోటోగ్రఫీలో గణనీయమైన మెరుగుదల తీసుకురావచ్చు. ఇంకా ఈ సిరీస్‌లో DSLR తరహా అనుభవాన్ని అందించేందుకు వేరియబుల్ అపెర్చర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. ఇది కెమెరాలోకి వచ్చే కాంతిని నియంత్రించడంలో సహాయపడుతూ, ఫోటోల్లో డెప్త్, ఎక్స్‌పోజర్‌ను మెరుగుపరుస్తుంది. టెలిఫోటో కెమెరాలో కూడా పెద్ద అపెర్చర్, మెరుగైన జూమ్ పనితీరు వంటి ఫీచర్లు ఉండవచ్చని తెలుస్తోంది.
ఫ్రంట్ కెమెరా విషయంలో కూడా అప్‌గ్రేడ్‌లు ఉండే అవకాశముంది. అధిక రిజల్యూషన్ సెన్సార్‌తో సెల్ఫీలు, వీడియో కాలింగ్ మరింత క్లియర్‌గా ఉండేలా చేయనున్నట్లు సమాచారం. అదనంగా వీడియో రికార్డింగ్ సామర్థ్యాలను కూడా మెరుగుపరచే దిశగా కంపెనీ పనిచేస్తోంది. ఈ మోడళ్లను సాధారణంగా ఆపిల్ అనుసరించే షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2026లో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం లీకులపై ఆధారపడి ఉన్న సమాచారమే కావడంతో, అధికారిక ప్రకటన కోసం వినియోగదారులు ఎదురుచూడాల్సి ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
