ఐటీ కంపెనీల్లో పనిచేసే వారికి కొత్త ఏడాది చేదు వార్తని అందించింది. 2023 మొత్తం లే ఆఫ్ లతో గడిచిపోయింది. ఎప్పుడు కంపెనీ నుంచి తమను తొలిగించామని మెయిల్ వస్తోందో అన్న ఆలోచనతో కంటి నిండా కునుకు లేకుండా బిక్కు బిక్కుమని బ్రతికారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఈ సారైనా వీటికి భిన్నంగా పరిస్థితులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసిన వారికి ఎదురు దెబ్బ తప్పదంటోంది ఈ సర్వే. గతంలో కంటే ఎక్కువ శాతం లే ఆఫ్ లు ఉండనున్నట్లు కీలక సమాచారాన్ని వెల్లడించింది రెజ్యూమ్ బిల్డర్ అనే సర్వే. ఈ సర్వేలో భాగంగా దాదాపు 10 కంపెనీల అధినేతలతో సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంది. అందులో నాలుగు కంపెనీలు 2024లో తమ ఉద్యోగులను తొలగించే అవకాశం అధికంగా ఉన్నట్లు ప్రకటించాయని ఈ తాజా నివేదికలో తెలిపింది. ఇక సగానికిపైగా ఐటీ సంస్థలు హైరింగ్ ఫ్రీజ్ ని అమలు చేయాలని చూస్తున్నాయి. అంటే కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు కనుమరుగవడం ఖాయంగా కనిపింస్తోంది.
ఈ లేఆఫ్ లు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాలేదు. అటు నిర్మాణ, ఫైనాన్స్, ఇన్సురెన్స్ సంస్థల్లోనూ కొనసాగే అవకాశం ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది సాఫ్ట్ వేర్ రంగంలో 66 శాతం మందికి లే ఆఫ్ బారినపడగా.. వచ్చే ఏడాది 65శాతం మంది లే ఆఫ్ అనే పెను భూతం బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు ఐటీ నిపుణులు. ఇక రిటైల్ కంపెనీల్లో 44 శాతం, ఫైనాన్స్ కంపెనీల్లో 38 శాతం మంది రానున్న కాలంలో లే ఆఫ్ లను ఎదుర్కోక తప్పదని సూచిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో వచ్చిన ముఖ్యమైన మార్పులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఒక వైపు హమాస్, ఇజ్రాయెల్ యుద్దం కారణంగా సాఫ్ట్ వేర్ రంగానికి మంచి వేదిక అయిన ఈ ప్రాంతంలో ఉన్న కంపెనీలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నాయి. అలాగే ప్రధాన దేశాల్లో వచ్చిన ఆర్ధిక మాంద్యం కారణంగా కూడా కొన్ని ఐటీ సంస్థలు మూత పడ్డాయి. వీటన్నింటికంటే కూడా ప్రస్తుతం ఏఐ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన భూమిక పోషిస్తోంది. దీని కారణంగా అనేక సంస్థలు తమ కంపెనీలు పని చేస్తున్న ఉద్యోగుల స్థానంలో ఏఐ ఆధారిత టూల్స్ ఉపయోగించుకోని ముందుకు సాగుతున్నాయి. గతంలో గూగుల్ యాడ్స్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఇలా అన్ని కారణాలు కలుపుకొని 2024లో దాదాపు 30 శాతం మందికిపైగా ఉద్యోగులు లేఆఫ్ బాట పట్టనున్నట్లు తాజా సర్వే స్పష్టం చేసింది. ఇందులో పెద్ద, చిన్న, మధ్య తరహా కంపెనీలు ఉన్నట్లు తెలిపింది. ఒక్కో కంపెనీలో ఒక్కో విధంగా తొలగింపు చర్యలు ఉండనున్నాయి. చిన్న కంపెనీల్లో 28 శాతం మందిని, మధ్యతరహా కంపెనీల్లో 42 శాతం మందిని, పెద్ద కంపెనీల్లో 39 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..