
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Poco తన తదుపరి మిడ్‌రేంజ్ లైనప్‌పై పని చేస్తున్నట్లు తాజా లీక్‌లు సూచిస్తున్నాయి. గత ఏడాది వచ్చిన X7 సిరీస్‌కు కొనసాగింపుగా Poco X8 Pro, Poco X8 Pro Max మోడళ్లను కంపెనీ సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, కొత్త రెండర్ చిత్రాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ డిజైన్, కలర్స్‌పై ముందస్తు సంకేతాలు ఇస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టుల ప్రకారం.. Poco X8 Pro ఫ్లాట్ బ్యాక్ డిజైన్‌తో వస్తుంది.
అంచుల వద్ద స్వల్ప వంపుతో ఉండే ఈ డిజైన్ చేతిలో పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్ వెనుక ఎగువ ఎడమ మూలలో నిలువు పిల్ ఆకార కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది. ఇందులో రెండు పెద్ద లెన్స్ రింగులు ఉండటం వల్ల తాజా ఐఫోన్‌లను గుర్తు చేసే లుక్ కనిపిస్తోంది. ముందుభాగంలో స్లిమ్ బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే, మధ్యలో పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది. కుడివైపు పవర్, వాల్యూమ్ బటన్లు ఉండగా, పవర్ బటన్‌కు ప్రత్యేక నారింజ యాస ఇవ్వడం Poco స్టైల్‌ను కొనసాగిస్తున్న సూచనగా కనిపిస్తోంది. వెనుక భాగంలో పెద్ద అక్షరాలతో Poco బ్రాండింగ్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక Poco X8 Pro Max విషయానికి వస్తే, ఇది సాధారణ Pro మోడల్‌లాగే డిజైన్‌ను కొనసాగిస్తుంది. అయితే కెమెరా లెన్స్ రింగులు కొద్దిగా పెద్దగా కనిపించడం వల్ల కెమెరా అప్‌గ్రేడ్‌లు ఉండే అవకాశం ఉందని లీక్‌లు సూచిస్తున్నాయి. రెండు ఫోన్లు బ్లాక్, వైట్, బ్లూ కలర్స్‌లో రావచ్చని సమాచారం. లాంచ్ తేదీపై Poco ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ స్థాయి లీక్‌లు బయటకు రావడంతో గ్లోబల్ రిలీజ్‌కు చాలా దూరంలో లేదని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. స్పెసిఫికేషన్లు, ధర వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి