AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm: బ్యాంక్‌ అకౌంట్‌ లేకుండానే UPI వాడొచ్చు! పేటీఎం కొత్త ఫీచర్..!

పేటీఎం 'పాకెట్ మనీ' టీనేజర్ల కోసం కొత్త ఫీచర్. బ్యాంక్ ఖాతా లేకుండానే యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. మెట్రో, షాపింగ్ వంటి వాటికి సులభంగా చెల్లించవచ్చు. తల్లిదండ్రులు ఖర్చులను పర్యవేక్షించవచ్చు, పరిమితులను సెట్ చేయవచ్చు. ఇది పిల్లలలో బాధ్యతాయుతమైన డిజిటల్ ఖర్చు అలవాట్లను ప్రోత్సహిస్తుంది.

Paytm: బ్యాంక్‌ అకౌంట్‌ లేకుండానే UPI వాడొచ్చు! పేటీఎం కొత్త ఫీచర్..!
Paytm
SN Pasha
|

Updated on: May 18, 2026 | 12:10 PM

Share

పేటీఎం టీనేజర్ల కోసం ప్రత్యేకంగా పాకెట్ మనీ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా బ్యాంక్ ఖాతా లేకుండానే యువ వినియోగదారులు UPI చెల్లింపులు చేయగలుగుతారు. మెట్రో ప్రయాణాలు, ఫుడ్ ఆర్డర్లు, మొబైల్ రీఛార్జ్‌లు, ఆన్‌లైన్ షాపింగ్ వంటి రోజువారీ ఖర్చులను సులభంగా నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అదే సమయంలో పిల్లల ఖర్చులపై తల్లిదండ్రులకు పూర్తి నియంత్రణ కూడా అందుబాటులో ఉంటుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఫీచర్ వల్ల టీనేజర్లు ప్రతిసారి నగదు కోసం లేదా ప్రతి చెల్లింపుకు తల్లిదండ్రుల అనుమతి కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఒకసారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అనుమతి ఇచ్చిన తర్వాత, టీనేజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో స్వతంత్రంగా పేటీఎం UPIని ఉపయోగించవచ్చు.

అయితే ఖర్చులను పర్యవేక్షించడం, ఖర్చు పరిమితులను నిర్ణయించడం, అవసరమైతే యాక్సెస్‌ను నిలిపివేయడం వంటి నియంత్రణలు మాత్రం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటాయి.ఈ ఫీచర్‌లో భద్రతకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఒక్కో లావాదేవీ గరిష్ట పరిమితిని రూ.5,000గా నిర్ణయించారు. అలాగే మొత్తం నెలవారీ ఖర్చు పరిమితి రూ. 15,000గా ఉంటుంది. అంతర్జాతీయ చెల్లింపులు లేదా నగదు విత్‌డ్రా సదుపాయం ఈ ఫీచర్‌లో అందుబాటులో ఉండదు. యాక్టివేషన్ అనంతరం తొలి 30 నిమిషాల వరకు లావాదేవీలకు రూ. 500 పరిమితి, తొలి 24 గంటల వరకు రూ.5,000 పరిమితి అమల్లో ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా మొబైల్ డివైస్ లాక్ తప్పనిసరిగా ఉండాలని కంపెనీ సూచించింది.

పాకెట్ మనీ ఫీచర్‌లో స్పెండ్ సమ్మరీ టూల్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా కుటుంబాలు ఖర్చుల సరళిని ట్రాక్ చేసుకోవచ్చు. ఖర్చులు ఆటోమేటిక్‌గా వర్గీకరించబడతాయి. తల్లిదండ్రులు తమ పేటీఎం UPI PIN ద్వారా ఖర్చు పరిమితులను మార్చడం లేదా యాక్సెస్‌ను బ్లాక్ చేయడం కూడా చేయవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే ముందుగా పేటీఎం యాప్‌ను అప్‌డేట్ చేయాలి. అనంతరం యాప్‌లోని Payments విభాగంలో Pocket Money ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత తల్లిదండ్రులు సంబంధిత కాంటాక్ట్‌ను సెలెక్ట్ చేసి, వెరిఫికేషన్ పూర్తి చేసి, నెలవారీ ఖర్చు పరిమితిని సెట్ చేసి, తమ Paytm UPI PINతో ఆమోదించాలి. టీనేజర్ ఆహ్వానాన్ని అంగీకరించిన తర్వాత ఈ ఫీచర్ యాక్టివ్ అవుతుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us