
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, తొలిసారిగా అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరణ వైపు నడిపిస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద నిర్మిస్తున్న నూతన స్పేస్ పోర్ట్‌ను భారత ప్రభుత్వ సంస్థ అయిన ‘ఇన్-స్పేస్’ (IN-SPACe)కు అప్పగించింది. దేశ వాణిజ్య సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో, ఈ లాంచ్ ప్యాడ్ కేంద్రాన్ని టెండర్ల ద్వారా ప్రైవేటీకరించి ఇస్రో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించింది.
ఈ మేరకు కులశేఖరపట్నంలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ. 950 కోట్ల వ్యయంతో ఇస్రో చేపట్టిన రెండవ రాకెట్ ప్రయోగ కేంద్రం పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇస్రో ఇటీవల స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పేరుతో తక్కువ ఖర్చుతో తక్కువ బరువు తక్కువ సమయంలో ప్రయోగాలు చేపట్టేలా సరికొత్త వాహక నౌక ను తయారు చేసి టెస్ట్ లాంచ్ సక్సెస్ చేసింది.. ఇదే తరహా రాకెట్ ప్రయోగాలకు కులశేఖర పట్నం అనువుగా ఉంటుంది.. ఇస్రో స్వదేశీ అవసరాల కోసం శ్రీహరి కోట నుంచి కీలక ప్రయోగాలను చేపట్టాలని నిర్ణయించింది.
పోటీపడుతున్న ప్రైవేటు సంస్థలు
అయితే ప్రైవేటు రాకెట్ ప్రయోగాల ప్రోత్సాహం కోసం ఏర్పాటైన ‘ఇన్-స్పేస్’, కులశేఖరపట్నం రాకెట్ ప్రయోగ కేంద్రం నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ టెండర్లలో స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ వంటి ప్రముఖ ప్రైవేటు సంస్థలు సుమారు రూ. 1,000 కోట్ల వరకు బిడ్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ కేంద్రం ద్వారా చేపట్టే చిన్న తరహా రాకెట్ ప్రయోగాలన్నింటినీ ఈ ప్రైవేటు కంపెనీల ద్వారానే నిర్వహించనున్నారు.
నాసా తరహాలోనే భారత్ వ్యూహం
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పరిశోధనల్లో తీరిక లేకుండా ఉన్న సమయంలో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించడంతో ‘స్పేస్ఎక్స్’ వంటి సంస్థలు కీలక స్థాయికి ఎదిగాయి. ఎలాన్ మస్క్‌కు నాసా అందించిన మద్దతు తరహాలోనే, భారత్ కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో విదేశీ వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాలను వేగవంతం చేయాలని భావిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇస్రోలోని మరికొన్ని కీలక విభాగాలను కూడా ప్రైవేటీకరించే యోచనలో శాస్త్రవేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.,