స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? ఈ విషయం తెలియకపోతే డేంజర్‌లో మీ డేటా
మనం వాడే స్మార్ట్‌ఫోన్‌లకు కూడా ఒక 'ఎక్స్‌పైరీ డేట్' ఉంటుందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఫోన్ స్క్రీన్, బ్యాటరీ బాగున్నా, కంపెనీ ఇచ్చే సాఫ్ట్‌వేర్ మరియు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఆగిపోతే అది టెక్ భాషలో ‘ఎండ్ ఆఫ్ లైఫ్’ (EOL) కిందకు వస్తుంది. ఇలాంటి ఫోన్లను వాడటం వల్ల మన పర్సనల్ డేటా మరియు బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది.

కొత్త ఫోన్ కొనేటప్పుడు కెమెరా, ర్యామ్ గురించి ఆలోచించినట్లే, అది ఎన్ని ఏళ్లపాటు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇస్తుందో కూడా చూడటం చాలా ముఖ్యం. సెక్యూరిటీ అప్‌డేట్స్ ఆగిపోతే మీ ఫోన్ హ్యాకింగ్‌కు గురయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మీ ఫోన్ ఇంకా సేఫ్ జోన్‌లో ఉందా? లేదా దాని లైఫ్ టైమ్ ముగిసిందా? అని తెలుసుకోవడానికి అనుసరించాల్సిన సులభమైన పద్ధతులు మరియు స్మార్ట్ నిర్ణయాల గురించి వివరంగా తెలుసుకుందాం..
‘ఎండ్ ఆఫ్ లైఫ్’ అంటే..
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ ఫోన్‌లకు నిర్ణీత కాలం పాటు ‘ఆపరేటింగ్ సిస్టమ్’ (OS) అప్‌డేట్స్ మరియు ‘సెక్యూరిటీ ప్యాచ్’లను అందిస్తాయి. కంపెనీలు ఈ అప్‌డేట్స్ ఇవ్వడం ఆపేసిన రోజునే ‘ఎండ్ ఆఫ్ లైఫ్’ అంటారు. సెక్యూరిటీ అప్‌డేట్స్ ఆగిపోతే, ఫోన్‌లోని భద్రతా లోపాలను సరిచేసే అవకాశం ఉండదు. తద్వారా హ్యాకర్లు సులభంగా మీ ఫోన్‌ను హ్యాక్ చేసి, మీ డేటాను దొంగిలించవచ్చు.
ఎక్స్‌పైరీ డేట్ ఎలా తెలుసుకోవాలి?
మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకోవడానికి రెండు సులభమైన మార్గాలు ఉన్నాయి:
- endoflife.date వెబ్‌సైట్: బ్రౌజర్‌లో ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి, మీ ఫోన్ బ్రాండ్ మరియు మోడల్ పేరును సెర్చ్ చేయండి. అక్కడ మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ముగిసే ఖచ్చితమైన తేదీ కనిపిస్తుంది.
- గూగుల్ సెర్చ్: గూగుల్‌లో మీ “మొబైల్ మోడల్ పేరు + end of software support” అని టైప్ చేసి సెర్చ్ చేస్తే కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్ వివరాలు లభిస్తాయి.
ఏ జాగ్రత్తలు..
ఒకవేళ మీ ఫోన్‌కు అప్‌డేట్స్ రావడం ఆగిపోతే, దాన్ని వెంటనే పారేయాల్సిన అవసరం లేదు. కానీ, ఆ ఫోన్ ద్వారా బ్యాంకింగ్ యాప్స్, యూపీఐ పేమెంట్స్ లేదా ఆన్‌లైన్ షాపింగ్ వంటి ఆర్థిక లావాదేవీలు చేయడం మాత్రం పూర్తిగా మానేయాలి. ఇలాంటి పాత ఫోన్లను కేవలం మ్యూజిక్ వినడానికి, వీడియోలు చూడటానికి లేదా పిల్లల ఆన్‌లైన్ క్లాసుల కోసం మాత్రమే వాడుకోవచ్చు.
స్మార్ట్ నిర్ణయం ఎలా తీసుకోవాలి?
భవిష్యత్తులో మీరు కొత్త ఫోన్ కొనేటప్పుడు కేవలం డిజైన్, కెమెరాపైనే కాకుండా, ఆ కంపెనీ ఎన్ని ఏళ్లపాటు అప్‌డేట్స్ ఇస్తుందో గమనించండి. ప్రస్తుతం గూగుల్, శామ్‌సంగ్ వంటి కంపెనీలు కొన్ని మోడల్స్‌కు ఏకంగా 7 ఏళ్ల వరకు అప్‌డేట్స్ ఇస్తున్నాయి. కాబట్టి, కొనేముందే అప్‌డేట్ పాలసీని చెక్ చేసుకోవడం ఒక స్మార్ట్ కొనుగోలుదారుని లక్షణం. మీ ఫోన్ డేటాను సురక్షితంగా ఉంచుకోవాలంటే ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ ఫోన్‌ను వాడుకోవడమే ఏకైక పరిష్కారం!
