Instagram: ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ బంద్..? అసలు నిజం బయటపెట్టిన కేంద్రం..

ఆగస్టు 25 నుంచి మన దేశంలో ఇన్‌స్టాగ్రామ్‌ పనిచేయదు.. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించనుంది అనే వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ ఒక్క ప్రచారంతో కోట్లాది మంది యూజర్లు, క్రియేటర్లు, డిజిటల్ వ్యాపారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అసలు ప్రభుత్వం నిజంగానే అంత పెద్ద నిర్ణయం తీసుకుందా? ఈ ప్రచారంలో నిజమెంత? అనేది తెలుసుకుందాం..

Instagram: ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ బంద్..? అసలు నిజం బయటపెట్టిన కేంద్రం..
Is Instagram Banned In India

Updated on: Jul 28, 2026 | 9:32 AM

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. భారత ప్రభుత్వం త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను నిషేధించబోతుంది అనేది ఆ వార్త సారాంశం. ఈ ప్రచారం సోషల్ మీడియా యూజర్లలో, ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లు, డిజిటల్ మార్కెటర్లు, చిన్న వ్యాపారవేత్తలలో తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే తాజాగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి, అసలు నిజానిజాలను వెల్లడించింది. ఆగస్టు 25 నుంచి భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్ పనిచేయదని, ప్రభుత్వం దానిపై నిషేధం విధిస్తుందని ఒక పోస్ట్ తెగ వైరల్ అయింది. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయాలంటూ ఆ పోస్ట్‌లో విజ్ఞప్తి చేశారు. దాంతో నిజమేనని భావించిన చాలామంది వినియోగదారులు ఆందోళనకు గురై, ఈ వార్త నిజమో కాదో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత

ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వేగంగా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని, అది పూర్తిగా అవాస్తవమని, తప్పుదోవ పట్టించే ప్రచారమని స్పష్టం చేసింది. ‘‘భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్‌ను మూసివేయడం లేదా నిషేధించడంపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక నిర్ణయం, ప్రకటన గానీ చేయలేదు. ఇది పూర్తిగా ఒక నకిలీ ప్రచారం’’ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.

తప్పుడు వార్తలను నమ్మవద్దు

సోషల్ మీడియాలో వచ్చే ఆధారాలు లేని వార్తలను, అనుమానాస్పద పోస్టులను గుడ్డిగా నమ్మవద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పౌరులకు విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా వార్త లేదా పోస్ట్‌పై సందేహం ఉంటే దాని ప్రామాణికతను ధృవీకరించుకోవడానికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందానికి పంపవచ్చని తెలిపింది.

ప్రభుత్వం సోషల్ మీడియాపై చర్యలు తీసుకోగలదా?

మన దేశంలో సేవలు అందించే ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినా ఇక్కడి ఐటీ రూల్స్, చట్టాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ వంటి అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా నిషేధించడమనేది చట్టపరమైన ప్రక్రియలతో కూడుకున్న ఒక పెద్ద నిర్ణయం. దానికి అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు తప్పనిసరి. అందువల్ల ఇలాంటి అధికారిక ప్రకటనలు లేని పుకార్లను నమ్మి కంగారు పడవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us