Indian Railways: రైల్వే శాఖ అప్‌డేట్ అవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తోంది. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా మెరుగైన సౌకర్యాలను అందిస్తున్న సంస్థ.. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానంలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వినియోగదారుల సందేహాల నివృత్తి కోసం ‘ఆస్క్ డిశా’(డిజిటల్ ఇంటరాక్షన్ టు సీక్ హెల్ప్ ఏనీటైం) పేరుతో చాట్ బాట్‌ను ఆవిష్కరించిన ఐఆర్‌సీటీసీ.. ఇప్పుడు ఈ చాట్ బాట్ అత్యాధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను అనుసంధానించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. దీని ద్వారా ప్రయాణికుడు నోటితో కమాండ్ ఇవ్వడం ద్వారా ఈజీగా టికెట్ బుక్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనిని వాయిస్ సెంట్రిక్ ఈ-టెకెటింగ్ అని అంటారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆన్‌లైన్‌లో రైలు టికెట్‌ను బుక్ చేయడానికి సగటు ప్రయాణికుడికి చాలా సమయం వృథా అవుతోంది.ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కి లాగిన్ చేసి, అందులోని ఫారమ్‌లో ప్రయాణికుల పేరు, ఇతర వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి వస్తోంది. దీని వల్ల చాలా సమయం వృథా అవుతోంది. ఫలితంగా మనం టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నం ప్రారంభించినప్పుడు సీటు ఖాళీ కనిపించినా.. ఈ ఫారం అంతా పూర్తి చేసి పేమెంట్‌చేసే సమయానికి వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్లిపోతోంది. దీనిని పరిహరించేందుకు అత్యాధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మీ వివరాలు నోటితో చెప్పడం ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడిన వాయిస్ సెంట్రిక్ ఈ-టెకెటింగ్ విధానాన్ని ఐఆర్‌సీటీసీ ఇప్పటికే పరీక్షించడం ప్రారంభించింది. పలు నివేదికల ప్రకారం తొలి దశ పరీక్షలు విజయవంతం అయ్యాయి. మరికొన్ని దశల పరీక్షలు నిర్వహించనున్నారు. అన్నీ కుదిరితే వచ్చే మూడు నెలల్లోపు వాయిస్ ఆధారిత టికెట్ బుకింగ్ ని ఆవిష్కరించేందుకు ఐఆర్‌సీటీసీ కసరత్తు చేస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..