మోసంలో కొత్త ట్రెండ్.. పేదరికం ఫోటోలు చూపించి ఉన్నది ఊడ్చేస్తారు.. జాగ్రత్త.. వెంటనే ఇలా..

సైబర్ నేరస్థులు నకిలీ స్వచ్ఛంద సంస్థల పేరుతో ప్రజల విరాళాలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఎమోషనల్ ఫొటోస్, చిన్న మొత్తాల విరాళాల అభ్యర్థనలతో నకిలీ లింక్‌లు, QR కోడ్‌లు పంపి బ్యాంక్ వివరాలు చోరీ చేస్తున్నారు. సైబర్ దోస్త్ ఈ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తోంది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది.

మోసంలో కొత్త ట్రెండ్.. పేదరికం ఫోటోలు చూపించి ఉన్నది ఊడ్చేస్తారు.. జాగ్రత్త.. వెంటనే ఇలా..
Fake Ngo Scam

Updated on: Nov 24, 2025 | 7:07 PM

సైబర్ నేరస్థులు ఇప్పుడు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. ప్రజల విరాళాలు, సహాయం చేయాలనే సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకుని, నకిలీ స్వచ్ఛంద సంస్థల ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైబర్ దోస్త్ ఈ పెరుగుతున్న ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

ఈ మోసం ఎలా జరుగుతుంది..?

సైబర్ నేరస్థులు వ్యవస్థీకృత పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారు:

నకిలీ పేజీలు: మోసగాళ్లు నకిలీ NGOల పేరుతో సోషల్ మీడియాలో పేజీలు సృష్టిస్తారు.

ఎమోషన్ వల: పేద పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు లేదా విపత్తు బాధితుల బాధాకరమైన ఫోటోలు, కథనాలను పోస్ట్ చేసి ప్రజలను భావోద్వేగానికి గురిచేస్తారు.

చిన్న మొత్తాల విరాళాలు: వారు WhatsApp, ఫోన్ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా రూ.200 నుండి రూ.500 వంటి చిన్న మొత్తాలను అడుగుతారు. ఈ చిన్న మొత్తం కావడంతో, చాలా మంది వెంటనే విరాళాలు ఇవ్వడానికి మొగ్గు చూపుతారు.

నకిలీ లింకులు – QR కోడ్‌లు: విరాళం ఇవ్వడానికి నకిలీ లింక్ లేదా QR కోడ్‌ను పంపుతారు. ఈ లింక్‌లపై క్లిక్ చేసి డబ్బు బదిలీ చేసిన తర్వాత లేదా బ్యాంక్ వివరాలు పంచుకున్న తర్వాత, మొత్తం బ్యాంకు ఖాతాను ఖాళీ చేసే ప్రమాదం ఉంది.

మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండటానికి సైబర్ దోస్త్ కొన్ని కీలక సూచనలు చేసింది.

NGO దర్పన్ చెక్: ఏదైనా NGOకి విరాళం ఇచ్చే ముందు దాని రిజిస్ట్రేషన్‌ను NGO దర్పన్ పోర్టల్ (ngodarpan.gov.in) లో తప్పనిసరిగా చెక్ చేయండి.

అధికారికంగా: ఫోన్ లేదా మెసేజ్ ద్వారా వచ్చే విరాళ అభ్యర్థనలను వెంటనే నమ్మవద్దు. NGOని దాని అధికారిక వెబ్‌సైట్ లేదా ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించి, నిర్ధారించుకోండి.

లింక్‌లు వద్దు: తెలియని లింక్‌లు లేదా QR కోడ్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.

వివరాలు షేర్ చేయవద్దు: బ్యాంక్ వివరాలు, OTPలు లేదా UPI పిన్‌లను ఎప్పుడూ ఎవరితోనూ షేర్ చేయవద్దు.

నేరుగా విరాళం: ఎల్లప్పుడూ విశ్వసనీయ సంస్థకు, వారి అధికారిక ఖాతా ద్వారా మాత్రమే విరాళం ఇవ్వండి.

మీరు మోసపోతే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?

మీరు సైబర్ మోసానికి గురైతే వెంటనే ఈ చర్యలు తీసుకోండి.

పోర్టల్ ద్వారా: cybercrime.gov.in ని సందర్శించి, హోమ్ పేజీలోని రిపోర్ట్ అండ్ చెక్ సస్పిషియస్ విభాగంలో ఫిర్యాదు చేయండి.

హెల్ప్‌లైన్: అత్యవసర పరిస్థితుల్లో, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేయండి.

మోసాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే నివేదిస్తే, డబ్బును ఆపడానికి మరియు మోసగాళ్లను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి