
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నవారికి హోండా QC3 మరో ఆప్షన్‌గా వచ్చింది. పెద్ద స్టోరేజ్, మంచి రేంజ్, కనెక్టివిటీ ఫీచర్లతో రోజువారీ ప్రయాణాలకు అనుగుణంగా ఈ మోడల్‌ను రూపొందించారు. ఢిల్లీ, ఆగ్రా, కటక్, సూరత్, కొల్లంలో తొలుత అమ్మకాలు మొదలవుతాయి. 5 అంగుళాల TFT స్క్రీన్, నావిగేషన్, స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బుకింగ్ కోసం రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాలకు తర్వాత విస్తరించనుంది.
హోండా QC3ను తొలుత దేశవ్యాప్తంగా విక్రయించరు. ఢిల్లీ, ఆగ్రా, కటక్, సూరత్, కొల్లం నగరాల్లో మొదటి దశలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత దశలవారీగా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు. ఈ నగరాల్లోని కొనుగోలుదారులు హోండా వెబ్‌సైట్ లేదా సమీప రెడ్‌వింగ్ డీలర్‌షిప్‌లో రూ.5,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. డెలివరీలు ఎప్పుడు మొదలవుతాయో కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఈ స్కూటర్‌లో 3kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 145 కి.మీ. IDC రేంజ్ అందిస్తుంది. అయితే హోండా అధికారిక పోర్ట్‌ఫోలియో ప్రకటనలో 151 కి.మీ. IDCగా పేర్కొంది. 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 2 గంటల 40 నిమిషాలు పడుతుంది. పూర్తి ఛార్జింగ్‌కు దాదాపు నాలుగు గంటలు పడుతుంది.
సీటు కింద 32 లీటర్ల స్టోరేజ్ ఇవ్వడం మరో ప్రత్యేకత. హోండా QC1లోని 26 లీటర్ల స్థలంతో పోలిస్తే ఇది ఎక్కువ. హెల్మెట్లు, బ్యాగులు, రోజువారీ వస్తువులను పెట్టుకోవడానికి ఈ స్థలం ఉపయోగపడుతుంది.
5 అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఉంది. హోండా రోడ్ సింక్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, స్మార్ట్ ఫీచర్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. రూ.1.35 లక్షల ధరతో ఈ స్కూటర్‌కు టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, విడా VX2 Plus, ఏథర్ వంటి మోడళ్ల నుంచి పోటీ ఉంది.