
ప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్ అనేది ఓ ప్రాథమిక అవసరంగా మారిపోయింది. దానితో మానవ జీవితం ముడిపడిపోయింది. రకరకాల యాప్స్, రకరకాల ఫీచర్లు అన్నింటికీ కేరాఫ్ స్మార్ట్ ఫోనే. వ్యక్తిగత విషయాల దగ్గర నుంచి బ్యాంకింగ్ లావాదేవీల వంటివి కూడా ఫోన్ల ద్వారానే చేసేస్తున్నారు. దీంతో సహజంగానే ఫోన్లపై అధిక ఒత్తిడి పడుతుంది. వివిధ అవసరాల నేపథ్యంలో లెక్కకు మించిన యాప్స్, ఫైల్స్, ఫొటోలు, డేటా వంటివి స్టోర్ చేస్తున్నారు. ఫలితంగా ఫోన్ పనితీరు దెబ్బతింటుంది. అది స్లో అయిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి ప్రతి ఫోన్లో ర్యామ్, రోమ్ అని రెండు ఉంటాయి. ఈ రెండింటి సామర్థ్యానికి అనుగుణంగా మీరు యాప్స్, ఫైల్స్ స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మించితే ఫోన్ స్లో అయిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఫోన్లో పెద్దగా డేటా లేకపోయినా స్టోరేజ్ ఫుల్ అయిపోయినట్లు చూపిస్తుంది. ఫోన్ కూడా స్లో అయిపోతుంది. దీనికి కారణం కాష్(cache) కావచ్చు. ఇది ఫోన్లో అదనపు స్పేస్ తీసుకుంటుంది. ప్రతి యాప్ ఈ కాష్ డేటాను క్రియేట్ చేస్తుంది. దీనిని క్లియర్ చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఫోన్ పనితీరు మెరుగవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు కాష్ డేటాను డిలీట్ చేస్తూ ఉండాలి.
ప్రతి ఆండ్రాయిడ్ యాప్ పనిచేయడానికి కొంత సమాచారం, ఫైల్స్, డేటాను స్టోర్ చేసుకుంటుంది. ఈ డేటా తాత్కాలిక స్టోరేజ్ ఏరియాలో సేవ్ అవుతుంది. దీనినే యాప్ కాష్ అని పిలుస్తారు. ఈ యాప్ కాష్ ద్వారానే యాప్స్ సర్వర్ నుంచి మీ డేటాను రిట్రీవ్ చేస్తుంది. యాప్ వేగంగా స్పందించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ యాప్ కాష్ ను ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల పనితీరును కాష్ డేటా హరిస్తుంది. స్టోరేజ్ వృథా అవుతుంది. అంతేకాక కొన్ని పనిచేయని కాష్ ఫైల్స్ కూడా ఉంటాయి. దీనిని మీరు క్లియర్ చేయడం ద్వారా డిస్క్ స్టోరేజ్ కూడా పెరుగుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..