Google Gemini 3: ఛాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ జెమినీ సరికొత్త ఏఐ మోడల్.. ఇక మరింత సులువుగా..

గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఛాట్‌జీపీటీకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌ను ప్రవేశపెట్టింది. తాజాాగా గూగుల్ జెమినీ 3ని రిలీజ్ చేసింది. ఇటీవల ఛాట్‌జీపీటీ అప్‌డేటెడ్ వెర్షన్ 5.1ను లాంచ్ చేసిన కొద్ది రోజులకే గూగుల్ జెమినీ ఈ నిర్ణయం తీసుకోవడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Google Gemini 3: ఛాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ జెమినీ సరికొత్త ఏఐ మోడల్.. ఇక మరింత సులువుగా..
Google Gemini

Updated on: Nov 19, 2025 | 11:48 AM

Google launches Gemini 3: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్(AI) కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకో కొత్త ఫీచర్, అప్‌డేటెడ్ వెర్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ఏఐ(AI) ప్రస్తుతం టెక్నాలజీ మార్కెట్‌లో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఏఐకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీలన్నీ కొత్త టూల్స్‌ను తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి. దీంతో ఏఐ కంపెనీల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఏఐ కంపెనీలు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే ఏఐకి టెక్నాలజీ పరంగా భారీ డిమాండ్ ఉండటంతో ఈ రంగంలో కొత్త స్టార్టప్ కంపెనీలు కూడా పుట్టుకొస్తున్నాయి.

ఏఐ రంగంలో మిగతా సంస్థలకు పోటీగా దూసుకెళ్తున్న గూగుల్ జెమినీ తాజాగా అప్‌డేటెడ్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. గూగుల్ జెమినీ 3 పేరుతో కొత్త ఏఐ మోడల్‌ను తాజాగా ఆవిష్కరించింది. సందర్భం, సూక్ష్మ నైపుణ్యాలు, ఉద్దేశాన్ని బాగా అర్ధం చేసుకోవడానికి ఈ కొత్త మోడల్ ఉపయోగపడుతుందని గూగుల్ తన ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా సైబర్ దాడుల నుంచి రక్షించేలా జెమినీ 3ని రూపొందించినట్లు గూగుల్ ప్రకటించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో వస్తున్న ఏఐ మోడ్‌తో కూడా ఈ కొత్త ఏఐ మోడల్‌ను ఇంటిగ్రేట్ చేసినట్లు స్పష్టం చేసింది.

“ప్రస్తుతం గూగుల్ జెమినీ యాప్‌కు నెలకు 650 మిలియన్ల వినియోగదారులు వస్తున్నారు. ఇదే కాకుండా క్లౌడ్ కస్టమర్లలో 70 శాతం కంటే ఎక్కువ మంది ఏఐని ఉపయోగిస్తున్నారు. 13 మిలియన్ల డెవలపర్లు మా జనరేటివ్ మోడల్‌ను వినియోగిస్తున్నారు. మేము చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక స్నిప్పెట్ మాత్రమే” అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన బ్లాగ్ పోస్ట్‌లో కొత్త మోడల్ గురించి తెలిపారు.  కాగా ఇటీవల ఒపెన్ ఏఐ సంస్థ ఛాట్‌జీపీటీ అప్‌గ్రేడ్ వెర్షన్ జీపీటీ5.1ను ప్రవేశపెట్టింది. ఈ వెర్షన్‌లో ఛాట్‌జీపీటీ ఇచ్చే సమాధాలు చాలా తెలివిగా, సహజంగా అనిపిస్తాయి. ఈ ఫీచర్ వినియోగదారులను తెగ ఆకట్టుకుంటుంది. ఛాట్ జీపీటీ 5.1 మోడల్‌ను ప్రవేశపెట్టిన కొన్ని రోజులకే జెమినీ 3 మోడల్‌ను గూగుల్ రిలీజ్ చేయడం గమనార్హం.

 

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి