భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. గతంలో కేవలం కాల్స్, మెసేజ్‌లకు మాత్రమే ఉపయోగించే ఫోన్లు ప్రస్తుతం స్మార్ట్‌గా మారడంతో అన్ని అవసరాలకు వాటిపైనే ఆధారపడుతున్నాం. ముఖ్యంగా ఖాళీ సమయంలో టైమ్ పాస్ చేయడానికి ఎక్కువగా స్మార్ట్ ఫోన్‌లోని గేమ్స్ ఆడడానికి యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా 2020లో కరోనా సృష్టించిన విలయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో స్మార్ట్‌ఫోన్‌లోని వివిధ గేమ్స్‌ను ఆడడం వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందికి అలవాటు అయ్యింది. అయితే వీటిటో పబ్ జీ గేమ్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా బ్యాటిల్ బ్యాక్‌గ్రౌండ్ నేపథ్యంలో సాగే ఈ గేమ్‌ను ఒంటరిగానైనా లేదా గ్రూప్‌గా ఆడే అవకాశం ఉండడంతో చాలా మంది ఈ గేమ్‌ను ఇష్టపడ్డారు. అలాగే ఆ సమయంలోనే చాలా మంది టిక్ టాక్ చేయడం ద్వారా ఫేమస్ అయ్యారు. అయితే ఇలా సాగుతున్న తరుణంలో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ గేమ్‌తో మరికొన్ని చైనా యాప్స్‌ను నిషేధించింది. దీంలో చాలా మంది ఈ గేమ్‌కు దూరమయ్యారు.అయితే తాజాగా ఈ గేమ్ భారత్‌లో లాంచ్ కానుంది. ఆ వివరాలు ఏంటో ఓ సారి చూద్దాం.
వీడియో గేమ్ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు భారత అధికారుల నుంచి అనుమతి పొందినట్లు దక్షిణ కొరియా దిగ్గజం క్రాఫ్టన్ శుక్రవారం ప్రకటించింది. త్వరలో ఇది డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచాలని కంపెనీ యోచిస్తోంది. గతంలో పబ్‌జీ పేరుతో ఉన్న ఈ గేమ్‌ను బ్యాటిల్ గ్రౌండ్ పేరుతో లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు అనుమతించినందుకు భారతీయ అధికారులకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆ కంపెనీ ప్రతినిధులు తాజాగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారులకు అసాధారణమైన ఉత్పత్తులు, సేవలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. దేశంలో క్రాఫ్టన్ కంపెనీకు చెందిని మార్క్యూ ఆఫర్ పబ్‌జీను భారత ప్రభుత్వం నిషేధించిన రెండు సంవత్సరాల్లోపు సరికొత్తగా ఈ యాప్‌ను వేరే పేరుతో అధికారికంగా లాంచ్ చేస్తున్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొంటూ 117 చైనీస్ అప్లికేషన్‌లతో పాటుగా పబ్‌జీను భారత ప్రభుత్వం 2020 సెప్టెంబర్‌లో నిషేధించింది. నిషేధం విధించే సమయంలో పబ్‌జీ దేశంలో దాదాపు 33 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది మరియు వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే నవంబర్ 2020లోనే పబ్‌జీ ఇండియా పేరుతో లాంచ్ అవతుందని నివేదికలు తెలిపాయి. అప్పుడు పబ్‌జీ స్టూడియోస్, దక్షిణ కోరియా వీడియోగేమ్ కంపెనీ క్రాఫ్టన్ పబ్‌జీ మొబైల్‌ని పునఃప్రారంభించేందుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పబ్‌జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నమోదయ్యాయి. అలాగే బీజీఎఐ గేమ్‌ను మే 2021లో లాంచ్ చేస్తున్నట్లు క్రాఫ్టన్ ప్రకటించింది. ఈ గేమ్ ఆండ్రాయిడ్ పరికరాల కోసం జూలై 2న, ఐఓఎస్ పరికరాల కోసం ఆగస్టు 18న విడుదల చేశారు. ఒక సంవత్సరం వ్యవధిలో బీజీఎంఐ 100 మిలియన్ నమోదిత వినియోగదారులను అధిగమించింది. తర్వాత, భారత ప్రభుత్వం తమ ఆన్‌లైన్ స్టోర్‌ల నుంచి బీజీఎంఐ గేమింగ్ యాప్‌ను బ్లాక్ చేయమని గూగుల్, యాపిల్‌ను ఆదేశించింది. దీంతో ఆ సంస్థలు యాప్‌ను తొలగించాయి. అయితే తాజా వెర్షన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో మాత్రం స్ఫష్టత లేదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి