Hyderabad: మొబైల్‌లో ఈ ఫైల్ డౌన్‌లోడ్ చేస్తే.. కొంప కొల్లేరే
హైదరాబాద్‌లో ఒకే రోజు ఐదుగురు సైబర్ ఊబిలో చిక్కుకున్నారు. నకిలీ APK ఫైల్స్ పంపిన సైబర్ నేరగాళ్లు.. దాదాపు రూ.16.31 లక్షలు సదరు వ్యక్తుల నుంచి కాజేశారు. చివరికి మోసపోయామని తెలుసుకున్న వ్యక్తులు పోలీసులను ఆశ్రయించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

APK Files Mobile: సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తరచూ ఎక్కడో ఒకచోట సైబర్ నేరగాళ్ల వలలో పడి చాలామంది మోసపోతున్నారు. కంటికి కనిపించకుండా, ఎటువంటి అనుమానం లేకుండా చాలా తెలివిగా, స్మార్ట్‌గా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలకు సైబర్ డిపార్ట్‌మెంట్ ఎంత అవగాహన కల్పించినా సరే.. నేరగాళ్లు కొత్త పద్దతిని ఎంచుకుంటున్నారు. రోజుకో వినూత్న రితీలో ప్రజల సంపద కొల్లగొడుతున్నారు. తాజాగా ఐదుగురు వ్యక్తులు సైబర్ నేరస్తుల ఊబికి చిక్కుకుని లక్షల రూపాయలు పొగోట్టుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
నగరానికి చెందిన ఓ వృద్దుడికి యూనియన్ బ్యాంకు లైఫ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఒక ఏపీకే(APK) లింక్ మొబైల్‌కు వచ్చింది. దీంతో వృద్దుడు వెంటనే సదరు ఫైల్‌ను ఓపెన్ చేసి వివరాలు ఎంటర్ చేశాడు. దీంతో అతడు ఫోన్ హ్యాక్ చేసి దశలవారీగా రూ.10 లక్షలు దోచేశారు సైబర్ నేరగాళ్లు. ఇక మరో వృద్దుడికి కోటక్ మహీంద్రా బ్యాంకు క్రెడిట్ కార్డు పేరుతో మొబైల్‌కు ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేసి క్రెడిట్ కార్డు వివరాలు ఇవ్వగానే అతడి అకౌంట్ నుంచి రూ.1,72,999 గల్లంతయ్యాయి. ఇది చూసి షాక్ అయిన వృద్దుడికి కాసేపు గుండె ఆగినంత పనైంది. ఇలాగే మరో వ్యక్తికి ఆర్టీఏ ఎంపరివాహన్ యాప్ పేరుతో మొబైల్‌కు లింక్ పంపి అతడి ఫోన్‌ను హ్యాక్ చేశారు. ఆ తర్వాత అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.2.24,875 కొల్లగొట్టారు దోచేశారు.
ఇక మరో కేసులో ఒక వ్యక్తికి బీమా డీయాక్టివేషన్ పేరుతో లింక్ పంపి అతడి బ్యాంక్ ఖాతా నుంచి 1,09,891 దోచేశారు.అలాగే నగరానికి చెందిన 45 ఏళ్ల మరో వ్యక్తికి అనుమానాస్పద ఏపీకే ఫైల్ పంపి బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ.1.24 లక్షలు కాజేశారు. సైబర్ నేరగాళ్ల బారిన పడ్డామని తెలుసుకున్న ఈ ఐదుగురు ఒకే రోజు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ పనికి పాల్పడ్డ సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. నగరంలో ఒకే రోజు ఐదుగురు సైబర్ నేరగాళ్ల పాల్పడి లక్ష రూపాయలు పొగోట్టుకోవడం సంచలనంగా మారింది. ఈ ఐదుగురు నుంచి దాదాపు రూ.16.31 లక్షలను సైబర్ నేరగాళ్లు కొట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో అనుమానాస్పద APK ఫైల్స్‌ను డౌన్లోడ్ చేసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.




