ట్విట్టర్, వాట్సాప్, టిక్‌టాక్‌లపై దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా గ్రూప్స్‌లో కొందరు సున్నితమైన, మతపరమైన అంశాలను రెచ్చగొడుతూ, దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఎస్ శ్రీశైలం అనే సీనియర్ జర్నలిస్ట్ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు.. వాటిపై కేసు పెట్టాలంటూ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
గతేడాది డిసెంబర్ 12న భారత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా సదరు సోషల్ మీడియా వేదికగా వార్ జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన శాసనాన్ని ధిక్కరిస్తూ దేశ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని జర్నలిస్ట్ శ్రీశైలం హైదరాబాద్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. నగర పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. అలాగే కొన్ని వాట్సాప్ గ్రూప్, టిక్ టాక్ వీడియోలు, ట్వీట్ల వివరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం సైబర్ క్రైమ్ పోలీసులకు రిఫర్ చేశారు. దీంతో వారు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 153A, 121 A, 124, 124A, 294, 295 A, 505, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 200, సెక్షన్ 66A కింద కేసులు నమోదు చేశారు.