BHIM: భీమ్‌ యాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌! ఈ ఫీచర్‌ను ఇక ఫ్రీగా వాడుకోవచ్చు!

భీమ్ యాప్‌లో ఇప్పుడు ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. NPCI, TransUnion సిబిల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో, వినియోగదారులు తమ క్రెడిట్ రిపోర్ట్‌ను యాప్ నుంచే సులభంగా చూడవచ్చు. ఇది BHIMను కేవలం చెల్లింపుల యాప్‌గా కాకుండా, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణకు వేదికగా మార్చడమే లక్ష్యం.

BHIM: భీమ్‌ యాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌! ఈ ఫీచర్‌ను ఇక ఫ్రీగా వాడుకోవచ్చు!
Bhim

Updated on: Apr 21, 2026 | 1:47 PM

డిజిటల్ పేమెంట్స్‌ను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం లావాదేవీలకు మాత్రమే ఉపయోగపడిన BHIM యాప్‌లో ఇప్పుడు వినియోగదారులు తమ సిబిల్‌ స్కోర్‌ను కూడా నేరుగా చెక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీనికి భాగంగా NPCI, TransUnion సిబిల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు యాప్ నుంచి బయటకు వెళ్లకుండా తమ క్రెడిట్ స్కోర్‌తో పాటు పూర్తి క్రెడిట్ రిపోర్ట్‌ను సులభంగా వీక్షించవచ్చు.

వినియోగదారుల అనుమతి లేకుండా ఎలాంటి డేటా సేకరించబోమని NPCI స్పష్టం చేసింది. ఈ సదుపాయం BHIM 4.0.19 లేదా అంతకంటే పై వెర్షన్లలో అందుబాటులో ఉంది. భీమ్‌ను కేవలం చెల్లింపుల యాప్‌గా కాకుండా, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో సహాయపడే ప్లాట్‌ఫారమ్‌గా మార్చడమే ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బయోమెట్రిక్ ఆథెంటికేషన్, ఖర్చుల విశ్లేషణ, ఫ్యామిలీ మోడ్ వంటి ఫీచర్లను అందిస్తున్న ఈ యాప్, ఇప్పుడు క్రెడిట్ అవగాహన పెంపుపై కూడా దృష్టి సారిస్తోంది.

ఇక వినియోగదారులు తమ క్రెడిట్ రిపోర్ట్‌లోని లోపాలను గుర్తించి, వాటిని సరిచేసుకునే అవకాశాన్ని కూడా పొందుతున్నారు. సాధారణంగా వేర్వేరు వెబ్‌సైట్లు లేదా యాప్‌లను సందర్శించాల్సి రావడం వల్ల చాలా మంది తమ క్రెడిట్ స్కోర్‌ను తరచుగా చెక్ చేయరు. ఈ నేపథ్యంలో ఈ ఫీచర్ వినియోగాన్ని సులభతరం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భీమ్‌తో పాటు పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే వంటి ఇతర ప్రముఖ యూపీఐ యాప్‌లు కూడా ఉచితంగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసే సదుపాయాన్ని ఇప్పటికే అందిస్తున్నాయి. ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా నగరాలు, గ్రామాల్లో ఆర్థిక అవగాహనను మరింత పెంచే దిశగా కీలకంగా మారనున్నాయి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us