
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇది మనిషికి మూడో చేయిలాగా మారిపోయింది. ఎందుకంటే, ఫోన్ లేకుండా చాలా మందికి రోజు కాదు కదా గంట కూడా గడవడం లేదు. అంతలా స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు. బ్యాంక్ ఖాతాలు, యూపీఐ, వ్యక్తిగత ఫొటోలు ఇలాంటి అనేక కీలక సమాచారం ఫోన్లలోనే ఉంటుంది. అందుకే స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలి. చాలా మంది స్మార్ట్ ఫోన్లలో అనేక యాప్‌లు డౌన్‌లోడ్ చేస్తుంటారు. అయితే, ఎంత వరకు సురక్షితమని మాత్రం చాలా వరకు ఎవరూ ఆలోచించరు. దీంతో వ్యక్తిగత విషయాలు గల్లంతయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే సురక్షిత యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మన ఫోన్లో యాప్‌లు సురక్షితమేనా? కాదా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇన్‌స్టాల్ చేసే ప్రతి యాప్ మన ఫోన్లోని నిర్దిష్ట సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతి అడుగుతుంది. ఉదాహరణకు కెమెరా యాప్ అయితే.. మీ కెమెరాను యాక్సెస్ చేయడానికి అనుమతి అడుగుతుంది. కానీ, ఒక సాధారణ కాలిక్యులెటర్ యాప్.. మీ ఫొటో గ్యాలరీ, కాంటాక్టులు లేదా లొకేషన్ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతి అడిగితే మాత్రం అనుమానించాల్సిందే
అనేక హానికరమైన యాప్‌లు మీ ఫోన్లోని సమాచారాన్ని దొంగించేందుకు, ప్రకటనదారులకు విక్రయించేందుకు, బ్యాంక్ మోసాలకు పాల్పడేందుకు ఈ అనుమతులను ఉపయోగిస్తుంటాయి. అనధికార లేదా తెలియని సోర్సుల నుంచి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడంతో భద్రతా సమస్యలు ప్రారంభమవుతాయి. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ వంటి అధికారిక స్టోర్ల నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటే మోసాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే, ఇలాంటి యాప్ స్టోర్లు కఠినమైన భద్రతా తనిళీల తర్వాత ఆ యాప్‌లను అనుమతిస్తాయి. అయితే, ఇతర వెబ్ సైట్లు లేదా థర్డ్ పార్టీ స్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్‌లు సర్టిఫైడ్ కావు. ఇవి తరచుగా మన ఫోన్లోకి ప్రవేశించే ముందు మాల్వేర్, స్పైవేర్ లేదా వైరస్‌లను కలిగి ఉంటాయి.
అధికారిక స్టోర్ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. భద్రతా అనేది మీ మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనుమానాస్పద లింక్స్ లేదా తెలియని వెబ్‌సైట్ల నుంచి APK ఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేయకుంటే మంచిది.
యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందు అది అడిగే అనుమతుల గురించి జాగ్రత్తగా చదవండి. ఆ యాప్‌కి కాంటాక్ట్స్ పర్మిషన్స్ అవసరమా? అని ఆలోచించండి. గేమ్ యాప్‌లకి ఫోన్ యాక్సెస్ ఎందుకు అవసరమో? ప్రశ్నించుకోండి. అవసరం లేకున్నా మన ఫోన్లోని కీలక సమాచారాల అనుమతులు అడిగే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దు. మీరు మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్ పర్మిషన్లను పరిశీలించవచ్చు. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల అనుమతులకు మీరు ఎప్పుడైనా మార్చవచ్చు. విశ్వసనీయ డెవలపర్ల నుంచి వచ్చిన యాప్‌లను మాత్రమే ఉపయోగించండి. యాప్ పేరు తప్పుగా రాయబడి ఉన్నా లేదా తెలియని డెవలపర్ల నుంచి వచ్చినట్లయితే వాటితో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి యాప్‌లకు దూరంగా ఉండాలి.
యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు, దాని యూజర్ రివ్యూలు, రేటింగ్‌లను తనిఖీ చేయాలి. తక్కువ రేటింగ్ ఉన్నా.. ప్రతికూల, నకిలీ సమీక్షలు ఉన్నా.. వాటిని డౌన్‌లోడ్ చేయొద్దు. చాలా కాలంగా అందుబాటులో లేని కొత్త యాప్‌లు లేదా చాలా తక్కువ డౌన్‌లోడ్లు ఉన్న యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి.
ఆండ్రాయిడ్(Android) ఫోన్లలో గూగుల్ ప్లే ప్రొటెక్ట్ మీ యాప్‌లను హానికరమైన బెదిరింపుల కోసం స్కాన్ చేస్తుంది. దీన్ని ఎప్పుడూ ‘ఆన్’లోనే ఉంచండి.
ఇక ఐఓఎస్(ios).. యాపిల్ తన యాప్‌లను సురక్షితంగా ఉంచుతుంది. మీరు ఈ అధికారిక యాప్ స్టోర్ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫోన్లోని సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. అంతేగాక, ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసర్లు రెండింటినీ క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం వల్ల హ్యాకర్లు చొరబడకుండా నిరోధించవచ్చు. కొన్ని నమ్మకమైన యాంటీవైరస్ యాప్‌లు మీ ఫోన్‌ను మాల్వేర్ నుంచి రక్షిస్తాయి. ఇక, ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్స్, ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయొద్దు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ ఫోన్లోని సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.