Android: డేంజర్‌లో ఆండ్రాయిడ్ యూజర్స్.. ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేస్తే ఇక అంతే సంగతులు
భారతదేశంలోని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. సాధారణ యాప్‌ల మాదిరిగానే కనిపిస్తూ, వినియోగదారుల వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలించే కొత్త రకం మాల్‌వేర్ ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తోందని భద్రతా సంస్థలు గుర్తించాయి. ఈ మాల్వేర్స్ భారీన పడకుండా కొన్ని జాగ్రత్తలు సూచించింది. అవేంటో చూద్దాం పదండి.

భారతదేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఒక కొత్త సైబర్ ముప్పు వచ్చిపడింది. మనం నిత్యం ఉపయోగించే సాధారణ యాప్స్ మాదిరిగా కనిపించే కొన్ని యాప్స్‌లో మాల్వేర్ దాగి ఉన్నట్టు కేంద్ర భద్రతా సంస్థ గుర్తించింది. వాటిని ఒక్కసారి మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే అది మీ పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని లాగేసుకుంటుంది. OTP, పాస్‌వర్డ్, బ్యాంక్ వివరాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించడమే కాకుండా మీ ఖాతాలను కూడా ఖాళీ చేస్తుంది. అంతేకాదు మీ ఫోన్ మొత్తాన్ని దాని కంట్రోల్‌లోకి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ మాల్వేర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
ఇది మీ ఫోన్‌లోకి ఎలా వస్తుంది?
ఈ ప్రమాదకర వైరస్ ప్రధానంగా APK ఫైల్స్ రూపంలో వ్యాపి చెందుతుంది. వాట్సాప్, టెలిగ్రామ్ లేదా SMS ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్‌లపై మీరు క్లిక్ చేసినప్పుడు లేదా నకిలీ కస్టమర్ కేర్ కాల్స్ ద్వారా మిమ్మల్ని నమ్మించి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయించడం ద్వారా లేదా అనధికారిక వెబ్‌సైట్‌ల నుండి మీరు యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం ద్వారా ఇది మీ ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది.
ఈ మాల్‌వేర్ ఎలా పని చేస్తుంది?
ఈ ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్ సాధారణ బ్యాంకింగ్ యాప్‌లు, కస్టమర్ కేర్ యాప్‌లు లేదా మనం నిత్యం ఉపయోగించే ఇతర పాపులర్ యాప్‌ల రూపంలో ఉంటుంది. అనుకోకుండా మీరు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే.. అది మీ ఫోన్‌లోకి ప్రవేశించిన తర్వాత మీ బ్యాంక్ లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, పిన్ నంబర్లు, డెబిట్/క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని సేకరిస్తుంది. మీ ఫోన్‌కు వచ్చే OTP మెసేజ్‌లను మేనేజ్ చేస్తూ మీ ప్రమేయం లేకుండానే బ్యాంక్ లావాదేవీలు పూర్తి చేస్తుంది. అలాగే మీ కాల్ లాగ్స్, మెసేజ్‌లు, ఇతర వ్యక్తిగత వివరాలను యాక్సెస్ చేయడమే కాకుండా, మీ స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంటుంది.
మీరు ఈ మాల్వేర్ భారీన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి
- కేవలం గూగుల్ ప్లేస్ స్టోర్ వంటి అధికారిక యాప్స్ నుంచే యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి.
- తెలియని వ్యక్తులు పంపే లింక్‌లను క్లిక్ చేయకండి.
- యాప్‌లకు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
- వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్‌లలో వచ్చే APK ఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేయకండి
- మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి.
- అవసరం లేని థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లలో మీ బ్యాంకింగ్ వివరాలు నమోదు చేయకండి.
- మీ ఫోన్‌లో మీరు ఇన్‌స్టాల్ చేయని యాప్‌లు ఏవైనా కనిపిస్తే వెంటనే వాటిని డిలీట్ చేయండి.
గమనిక: సైబర్ నేరగాళ్లు మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోచుకుంటారు. కాబట్టి, ఫోన్‌లో ఏదైనా కొత్త యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందు అది ఎంతవరకు నమ్మకమైనదో సరిచూసుకోవడం చాలా ముఖ్యం.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
