ప్రస్తుతం మనం కృత్రిమ మేధ కాలంలో ఉన్నాం. ఎక్కడ చూసినా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) గురించే చర్చ నడుస్తోంది. ప్రతి రంగంలో ఏఐ ప్రవేశిస్తోంది. తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. అయితే ఇది ప్రారంభం మాత్రమేనని.. రానున్న కాలంలో మరిన్ని అద్భుతాలు ఏఐ ద్వారా ఆవిష్కృతమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దానికి ఎక్కువ సమయం కూడా పట్టదని స్పష్టం చేస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని ప్రముఖ ఏఐ-చిప్‌మేకర్ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కూడా వ్యక్తం చేశారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఏఐ కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని చెబుతున్నారు. ఏకంగా మనిషి రాయగలిగే ప్రతి పరీక్షలోనూ ఇది పాస్ అవుతుందని, మెడికల్ పరీక్షలు కూడా రాయగలుగుతుందని వివరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పురోగతి వచ్చే ఐదేళ్లలో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఎన్విడియా సీఈఓ జెన్సన్ అన్నారు. మనుషుల్లాగే ఆలోచించగలిగే, ప్రవర్తించే కంప్యూటర్‌లు రానున్న కాలంలో రానున్నాయని ఆయన చెప్పారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఎకనామిక్ ఫోరమ్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఐ పురోగతి ఎలా ఉండొచ్చు అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏఐ పురోగతి అనేది దానికి నిర్ధేశించిన లక్ష్యంపై ఆధారపడి ఉంటుందని ఎన్విడియా సీఈఓ జెన్సన్ చెప్పారు. మానవ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం అయితే, ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అది ఐదేళ్లలోపే సాధిస్తుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతానికి ఏఐ చట్టపరమైన బార్ పరీక్షల వంటి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించగలదని, అయితే గ్యాస్ట్రోఎంటరాలజీ వంటి ప్రత్యేక వైద్య పరీక్షలపై ఇప్పటికీ ఇది అండర్ ట్రైనింగ్ లోనే ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఐదేళ్లలో అందులో దేనినైనా ఉత్తీర్ణత సాధించగలిగేలా ఏఐ రూపొందుతుందని వివరించారు.
ఏఐ పరిశ్రమ విస్తరణకు మద్దతుగా పరిశ్రమలో “ఫ్యాబ్స్” అని పిలువబడే ఇంకా ఎన్ని చిప్ ఫ్యాక్టరీలు అవసరమవుతాయి అన్న ప్రశ్నకు కూడా హువాంగ్ జవాబిచ్చారు. పలు మీడియా నివేదికల్లో ఓపెన్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ ఆల్ట్‌మాన్ ఇంకా చాలా ఫ్యాబ్‌లు అవసరమని భావిస్తున్నట్లు వెల్లడైంది. ఇదే విషయాన్ని ఇన్విడియా కూడా నొక్కి చెప్పారు. రానున్న కాలంలో ఇంకా చాలా చిప్ ఫ్యాక్టరీలు అవసరమవుతాయని.. అంతేకాక ఏఐ చిప్‌లు మరింత మెరుగవుతాయని ఆయన వివరించారు. అత్యాధునిక సాంకేతికత దానికి యాడ్ అవుతుందని పేర్కొన్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..