
How India’s Electric Two-Wheelers Are Moving into the Mainstream పేరుతో BCG విడుదల చేసిన నివేదికలో భారత ఈవీ మార్కెట్‌లో వస్తున్న మార్పులను వివరించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లపై వినియోగదారుల అభిప్రాయాలు మెరుగుపడటం, కొత్త కస్టమర్ విభాగాలు మార్కెట్‌లోకి రావడం ఈ వృద్ధికి కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే బ్యాటరీ మన్నిక, రేంజ్, సర్వీసింగ్, గుంతల రోడ్లపై పనితీరు వంటి అంశాలపై కొనుగోలుదారుల్లో ఇంకా సందేహాలు ఉన్నాయి. Boston Consulting Group (BCG) తాజా నివేదిక ప్రకారం.. 2026లో తమ తదుపరి టూ వీలర్‌గా ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలని 43% మంది వినియోగదారులు ఆలోచిస్తున్నారు. 2024లో ఈ సంఖ్య 30% మాత్రమే ఉండటం గమనార్హం.
2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య భారత టూ వీలర్ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 9.9 శాతానికి చేరింది. FY2024లో ఇది 5.5 శాతంగా ఉంది. స్కూటర్ల విభాగంలో ఈ వృద్ధి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. FY2024లో మొత్తం స్కూటర్ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాటా 16.8 శాతంగా ఉండగా, 2026 ఆగస్టు వరకు FY2027లో ఇది 24.1 శాతానికి పెరిగింది. ప్రతి నెలా సుమారు 1.8 లక్షల మంది తొలిసారిగా ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేస్తున్నారని నివేదిక అంచనా వేసింది.
డిజైన్, పికప్, బ్రాండ్లపై నమ్మకం వంటి అంశాల్లోనూ ఈవీలకు ఆదరణ పెరిగింది. తక్కువ దూరం ప్రయాణించే ఉద్యోగుల్లో ఎలక్ట్రిక్ వాహనాల డిజైన్ బాగుందని భావించే వారి సంఖ్య 2024లో 30 శాతం ఉండగా, 2026లో 59 శాతానికి చేరింది. మంచి పికప్ ఉంటుందని భావించేవారి వాటా 27 నుంచి 48 శాతానికి పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలను పూర్తిగా తిరస్కరించే వారి సంఖ్య కూడా 38 నుంచి 29 శాతానికి తగ్గింది.
ఆదరణ పెరుగుతున్నప్పటికీ బ్యాటరీ జీవితకాలం, సర్వీసింగ్ సౌకర్యాలు, భద్రత, హైవేలపై ప్రయాణం, గుంతల రోడ్లపై పనితీరు వంటి అంశాలు కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈవీలు వాడుతున్నవారు రన్నింగ్ ఖర్చు, మెయింటెనెన్స్, సౌకర్యం, స్టోరేజ్, డిజిటల్ ఫీచర్ల విషయంలో సంతృప్తిగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. బ్యాటరీ వారంటీ, ఇన్సూరెన్స్, రీసేల్ సపోర్ట్ మెరుగుపడితే మరింత మంది కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంది.
మరోవైపు క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ రైడర్లు కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్లపై ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ఖర్చు, వేగం, సులభంగా నడిపే సౌకర్యం వీరికి ముఖ్యమైన అంశాలు. చిన్న నగరాల్లోని Gen Z వినియోగదారులు స్టైలిష్‌గా ఉండటంతో పాటు ఎక్కువ దూరం, గుంతల రోడ్లపై ప్రయాణించగల వాహనాలను కోరుకుంటున్నారు. 2023 నుంచి మార్కెట్‌లో ఎలక్ట్రిక్ టూ వీలర్ మోడళ్ల సంఖ్య సుమారు 30 శాతం పెరగగా, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మోడళ్ల సంఖ్య రెట్టింపైంది. అయినప్పటికీ ఐదు బ్రాండ్లు మార్కెట్‌లో సుమారు 83 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కాబట్టి ధర, పనితీరు, నాణ్యతతో పాటు అమ్మకం తర్వాత సర్వీసింగ్‌పై కంపెనీలు దృష్టి పెడితేనే ఈవీ మార్కెట్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంది.