FIFA 2026: ఫిఫా ఫుట్‌బాల్స్ ఏ దేశంలో తయారు చేస్తారో తెలుసా? 99 శాతం మందికి తెలియదు

ఫిఫా వరల్డ్ కప్ 2026లో వాడే అధికారిక ఫుట్‌బాల్స్ 'ట్రియోండా' పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో తయారవుతున్నాయి. అడిడాస్ రూపొందించిన ఈ బాల్స్‌ను ఫార్వర్డ్ స్పోర్ట్స్ ఉత్పత్తి చేస్తోంది. సియాల్‌కోట్‌ను ప్రపంచ ఫుట్‌బాల్ తయారీ రాజధానిగా పిలుస్తారు. అత్యాధునిక సాంకేతికత, నాణ్యతా ప్రమాణాలతో తయారైన ఈ బాల్స్ పాకిస్తాన్‌కు ఆర్థికంగా పెద్ద ఊతం.

FIFA 2026: ఫిఫా ఫుట్‌బాల్స్ ఏ దేశంలో తయారు చేస్తారో తెలుసా? 99 శాతం మందికి తెలియదు
Fifa 2026 Football Inside C

Updated on: Jun 26, 2026 | 3:43 PM

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్ టోర్నమెంట్ అయిన ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నీలో ఉపయోగిస్తున్న ఫుట్‌బాల్స్ ఏ దేశంలో తయారు చేస్తారో తెలుసా? చాలా మంది అమెరికానో, చైనానో అనుకుంటూ ఉంటారు. కానీ అసలు నిజం ఏంటో? ఏ దేశంలో వాటిని తయారు చేస్తారో తెలిస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు. ఇంతకీ ఫిఫా వరల్డ్ కప్‌లో వాడే ఫుట్ బాల్స్ ఏ దేశం తయారు చేస్తోందంటే.. పాకిస్థాన్. ఏంటి షాక్ అయ్యారా? వాళ్లకు అంత సీన్ కూడా ఉందని అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఉపయోగిస్తున్న అధికారిక మ్యాచ్ బాల్ ట్రియోండాను అమెరికా, కెనడా లేదా మెక్సికోలో కాకుండా మన శత్రు దేశమైన పాకిస్థాన్‌లో తయారు చేస్తున్నారు. ప్రముఖ క్రీడా వస్తువుల సంస్థ అడిడాస్ రూపకల్పన చేసిన ఈ బాల్‌ను పాకిస్థాన్‌కు చెందిన ఫార్వర్డ్ స్పోర్ట్స్ సంస్థ సియాల్‌కోట్ నగరంలో తయారు చేస్తోంది.

అక్కడే ఎందుకు?

1982 ప్రపంచకప్ నుంచి అధికారిక మ్యాచ్ బాల్స్ తయారీలో సియాల్‌కోట్ కీలక పాత్ర పోషిస్తుండగా, 2026తో ఈ సంప్రదాయం మరోసారి కొనసాగుతోంది. సియాల్‌కోట్‌ను ప్రపంచ ఫుట్‌బాల్ తయారీ రాజధానిగా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ప్రీమియం ఫుట్‌బాల్స్‌లో సుమారు 70 శాతం ఈ నగరంలోనే తయారవుతాయి. ఇక్కడ నైపుణ్యం కలిగిన కార్మికులు, అత్యాధునిక తయారీ సదుపాయాలు, దశాబ్దాల అనుభవం ఉండటంతో అడిడాస్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడే ఉత్పత్తి చేయడాన్ని ఎంచుకుంటాయి. ఫిఫా నిర్దేశించిన కఠిన నాణ్యత ప్రమాణాలను చేరుకోగలిగే కొద్దిమంది తయారీదారుల్లో ఫార్వర్డ్ స్పోర్ట్స్ ఒకటి.

‘ట్రియోండా’ తయారీలో ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఈ బాల్ కేవలం నాలుగు థర్మల్-బాండెడ్ ప్యానెల్స్‌తో రూపొందించారు. ప్రత్యేక షెప్ వల్ల గాల్లో స్థిరంగా ప్రయాణించడం, తడి వాతావరణంలో మెరుగైన గ్రిప్ లభిస్తుంది. అంతేకాదు ఇందులో అమర్చిన సెన్సార్ చిప్ ద్వారా బంతి కదలికల డేటా రియల్ టైమ్‌లో వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) వ్యవస్థకు చేరుతుంది.

ఒక బాల్ తయారీకి ఎంత ఖర్చు?

ఒక అధికారిక మ్యాచ్ బాల్ తయారీ వ్యయం కచ్చితంగా వెల్లడించకపోయినా, పరిశ్రమ అంచనాల ప్రకారం తయారీ ఖర్చు 20 నుంచి 35 అమెరికన్ డాలర్లు ( మన కరెన్సీలో సుమారు రూ.1,700–రూ.3,000) మధ్య ఉండొచ్చు. అయితే అదే అధికారిక మ్యాచ్ బాల్ అంతర్జాతీయ మార్కెట్లో 130 నుంచి 170 డాలర్ల (సుమారు రూ.11,000–రూ.14,500) వరకు ధర ఉంది. ప్రపంచకప్ కోసం ఎన్ని అధికారిక మ్యాచ్ బాల్స్ తయారయ్యాయో అడిడాస్ లేదా ఫార్వర్డ్ స్పోర్ట్స్ అధికారికంగా వెల్లడించలేదు. అందువల్ల ఈ టోర్నీ ద్వారా పాకిస్థాన్‌కు వచ్చిన కచ్చితమైన ఆదాయం కూడా వెల్లడికాలేదు. అయితే ప్రపంచకప్ ఒప్పందం వల్ల లక్షలాది మ్యాచ్, శిక్షణ, రిటైల్ బాల్స్ ఉత్పత్తి అవుతాయి. దీంతో ఫార్వర్డ్ స్పోర్ట్స్‌కు కోట్ల డాలర్ల ఎగుమతి ఆర్డర్లు లభించడంతో పాటు, సియాల్‌కోట్ ప్రాంతంలోని వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. పాకిస్థాన్ నుంచి ఏటా సుమారు 4 కోట్ల ఫుట్‌బాల్స్ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. ఫుట్ బాల్ తయారీలో పాకిస్థాన్‌కు ఇంత చరిత్ర ఉన్నా.. ఆటలో మాత్రం గుండుసున్నా అనే చెప్పాలి.ఇప్పటివరకు ఒక్కసారి ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు సరికదా.. కనీసం క్లబ్ టీమ్స్ కూడా పోటీ ఇచ్చే టీమ్ పాకిస్థాన్‌కు లేదు.

Follow Us