వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌కి జరిమానా పడింది. భారత్‌తో గత ఆదివారం ఫ్లోరిడా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కోసం మైదానంలోని ఫీల్డ్ అంపైర్‌కి కోపం తెప్పించిన పొలార్డ్‌కి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. జరిమానాతో పాటు పొలార్డ్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేరింది.
మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ చేస్తుండగా.. కీరన్ పొలార్డ్ మైదానం వెలుపలికి వెళ్లాలనుకున్నాడు. ఈ మేరకు ఫీల్డ్ అంపైర్ అనుమతి కోరుతూ బౌండరీ లైన్ వెలుపల ఉన్న సబ్‌స్టిట్యూట్ ఆటగాడ్ని గ్రౌండ్‌లోకి రమ్మని సైగ చేశాడు. కానీ.. ఓవర్ మధ్యలో సబ్‌స్టిట్యూట్‌ని అనుమతించమని చెప్పిన అంపైర్.. ఓవర్ ముగిసే వరకూ వేచి ఉండాలని సూచించాడు. కానీ.. పొలార్డ్ మాత్రం అంపైర్ సూచనకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ సబ్‌స్టిట్యూట్‌ని మైదానంలోకి రావాలని పదే పదే పిలిచాడు. దీంతో.. క్రమశిక్షణ తప్పిన పొలార్డ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది.