టీ-20 వరల్డ్‌కప్‌ నిర్వహణ సాధ్యం కాదంటూ చేతులెత్తేసిన బీసీసీఐ :T20 World Cup moved out of India.

| Edited By: Anil kumar poka

Jun 06, 2021 | 10:42 AM

ప్రతిష్టాత్మకమైన టీ-20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ను నిర్వహించలేమంటూ భారత్‌ చేతులెత్తేసింది. అందరూ అనుకున్నట్టుగానే ఈ టోర్నమెంట్ వేదిక మారబోతున్నది. మొన్నటి వరకు నిర్వహించి తీరుతామన్న..

టీ-20 వరల్డ్‌కప్‌ నిర్వహణ సాధ్యం కాదంటూ చేతులెత్తేసిన బీసీసీఐ :T20 World Cup moved out of India.
T20 World Cup Set To Be Moved Out Of India, Icc Intimated Internally
Follow us on

ప్రతిష్టాత్మకమైన టీ-20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ను నిర్వహించలేమంటూ భారత్‌ చేతులెత్తేసింది. అందరూ అనుకున్నట్టుగానే ఈ టోర్నమెంట్ వేదిక మారబోతున్నది. మొన్నటి వరకు నిర్వహించి తీరుతామన్న భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ఇప్పుడేమో తమ వల్ల కాదనేసింది.. నిజానికి టీ-20 ప్రపంచకప్‌ నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై తమకు స్పష్టత ఇవ్వాలంటూ బీసీసీఐకి ఐసీసీ విన్నవించుకుంది. పైగా జూన్‌ 28 వరకు ఏదో ఒకటి తేల్చి చెప్పాలంటూ గడువు కూడా విధించింది. అయితే బీసీసీఐ మాత్రం గడువుకు చాలా మందే తాము నిర్వహించలేమని చెప్పేసింది. ఈ మెగా టోర్నమెంట్‌ ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ మాసాల్లో జరగాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ టోర్నమెంట్‌ను నిర్వహించడం తలకు మించిన భారమే. ఎందుకంటే ఎనిమిది జట్లు ఉన్న ఐపీఎల్‌ టోర్నమెంట్‌నే నిర్వహించలేక సతమతమయ్యింది భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు.. ఇప్పుడు 16 జట్లు పాల్గొనే టీ-20 వరల్డ్‌కప్‌ను ఎలా నిర్వహించగలదు? అయితే టీ-20 వరల్డ్‌కప్‌పై బీసీసీఐ ఓ స్పష్టమైన అధికార ప్రకటన ఇంకా చేయకపోయినా తరలివెళ్లడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పుడు ఐసీసీ దగ్గరున్న మార్గం ఆ టోర్నమెంట్‌ను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరపడమే! ఆ దేశంతో పాటు కొన్ని మ్యాచ్‌లను ఒమన్‌లో కూడా నిర్వహించాలని అనుకుంటోంది. ఇందుకు భారత్‌ కూడా ఓకే చెప్పవచ్చు. ఆతిథ్యహక్కులు తమ దగ్గరే ఉంచుకుంటూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఒమన్‌ దేశాలలో ప్రపంచకప్‌ను నిర్వహిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఐసీసీకి బీసీసీఐ చెప్పిందట! కరోనా సెకండ్‌వేవ్‌ భారత్‌ను భయంకరంగా దెబ్బతీసింది.. కరోనా బారిన పడి ఎంతోమంది చనిపోయారు. ఇక ఇప్పుడు థర్డ్‌ వేవ్‌ భయం కూడా పట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ టీ-20 వరల్డ్‌ కప్‌ను నిర్వహించడమన్నది దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. పాజిటివ్‌ కేసుల సంఖ్య కొంచెం తగ్గినప్పటికీ కరోనా ఇంకా కంట్రోల్‌లోకి రాలేదు. ఇప్పుడు అదుపులోకి రావచ్చు కానీ రేపొద్దున థర్డ్‌ వేవ్‌ అంటూ వస్తే అన్నదే భయం కలిగిస్తోంది.

ఐపీఎల్‌ టోర్నమెంట్‌ అర్థాతరంగా ఆగిపోయినందుకే బీసీసీఐ లెక్కలేసుకుని బావురుమంటోంది.. కోట్ల రూపాయల నష్టం అంటూ వాపోతున్నది. ఇప్పుడీ టోర్నమెంట్‌ను నిర్వహించడం కష్టమని తెలిసిపోవడంతో యూఏఈలో జరిపేందుకు సిద్ధమవుతోంది.. ఇది కూడా సెప్టెంబర్‌ అక్టోబర్‌ మాసాల్లో! అప్పటికీ ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలు అంతర్జాతీయ మ్యాచ్‌లతో బీజీగా ఉంటాయి. కాబట్టి ఆయా దేశాలకు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొనడం కష్టమే. మరి టాప్‌ ప్లేయర్లు లేకుండా ఐపీఎల్ నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉండదు.. వరల్డ్‌కప్‌ విషయానికి వస్తే ఇది ఆల్‌రెడీ షెడ్యూల్‌ అయిన టోర్నమెంట్‌ కాబట్టి ఆటగాళ్లు పాల్గొనేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా ఇది ఐసీసీ నియంత్రణలో జరుగుతున్న టోర్నమెంట్‌ . ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌ను బీసీసీఐ అతి కష్టం మీద ఇండియాలోనే నిర్వహించిందనుకుందాం! ఇందులో పాల్గొనేందుకు విదేశీ ఆటగాళ్లు సుముఖత చూపుతారా? కరోనా భయం వారికి ఉండదా? ఇదేం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ కాదు కదా! ప్రపంచకప్‌… అంటే టీమ్‌లో దురదృష్టవశాత్తూ ఎవరికైనా కరోనా సోకితే ఆల్టర్‌నేట్‌ ఆటగాళ్లను బరిలో దింపవచ్చు. వరల్డ్‌కప్‌ అలా కాదుకదా! ఇందులో పార్టిసిపేట్‌ చేసే జట్లకు ఆ ఆవకాశం లేదు కదా!

ప్రపంచకప్‌ లాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్లను నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మొన్న ఐపీఎల్‌లో బయోబబుల్‌ ఎలా పని చేసిందో మనం చూశాం.. అందుకే కరోనా నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేసే యూఏఈ అయితేనే బెటరని ఐసీసీ కూడా భావిస్తోంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఇప్పటికే మూడు క్రికెట్‌ గ్రౌండ్స్‌ ఉన్నాయి. దుబాయ్‌, అబుదాబి, షార్జాలలో అంతర్జాతీయ మ్యాచ్‌లు అనేకం జరిగాయి.. ఇప్పుడు యూఏఈ పక్కనే ఉన్న ఒమన్‌లో కూడా కొన్ని మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ అనుకుంటోంది. ఒమన్‌ రాజధాని మస్కట్‌లో కూడా అద్భుతమైన క్రికెట్‌ స్టేడియం ఉంది. వరల్డ్‌కప్‌కు ముందు యూఏఈలో ఐపీఎల్ టోర్నమెంట్‌ జరిగితే మాత్రం మస్కట్‌లో కొన్ని మ్యాచ్‌లు నిర్వహించక తప్పదు. ఎందుకంటే ఐపీఎల్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహిస్తే పిచ్‌లలో లైఫ్‌ పోయే అవకాశాలున్నాయి. పిచ్‌లను మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లకు అనుగుణంగా తయారు చేయాలంటే టైమ్‌ పడుతుంది. కనీసం మూడు వారాల సమయం కావాలి. ఆ టైమ్‌కు టీ-20 వరల్డ్‌కప్‌ మొదలవుతుంది. అందుకే వరల్డ్‌కప్‌లోని మొదటి రౌండ్‌ మ్యాచ్‌లు మస్కట్‌లో నిర్వహిస్తే బాగుంటుందని ఐసీసీ భావిస్తోంది. వరల్డ్‌కప్‌ నిర్వహణపై భారత్‌ నుంచి స్పష్టమైన సమాచారం వస్తే తప్ప వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌పై ఓ స్పష్టత రాదు. మొత్తంగా టీ-20 ప్రపంచకప్‌ నిర్వహణ మాత్రం భారత్‌ను దాటేసి యూఏఈ చెంతకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Today Gold Rate, Silver Price Video: పసిడిప్రియులకు కాస్త ఊరట. గత కొద్దిరోజులుగా తగ్గుతూ పెరుగుతున్నా బంగారం ధరకు బ్రేక్.

కోయంబత్తూర్‌లోని వాల్పరైలో ఏనుగు బీభత్సం.. తేయాకు తోటపై విరుచుకుపడిన గజరాజు :Elephant viral video.

హిమాచల్ ప్రదేశ్ శివాలిక్ కొండల్లో కనిపించిన అరుదైన ,అతి విషపూరితమైన కింగ్ కోబ్రా : King Cobra Video

ఈ పిల్లి చేష్టలు చుస్తే నవ్వాపుకోలేరు..వేరే పిల్లిని పిలుస్తున్న యజమానిపై ఓ పిల్లి కోపం:Cat Viral Video