ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ తర్వాత భారత్‌లో మరో క్రీడా సంగ్రామానికి తెర లేవనుంది. డిసెంబర్ 2 నుండి ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 వరకు ఈ కబడ్డీ టోర్నీ కొనసాగుతుంది. గుజరాత్ జెయింట్స్, తెలుగు టైటాన్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరగనుంది. మొత్తం 12 నగరాలు ఈ కబడ్డీ లీగ్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. అన్ని జట్లు ఒక్కో నగరంలో 6 మ్యాచ్‌లు ఆడతాయి. మొదటి 6 రోజుల మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరుగుతాయి. ఆ తర్వాత వరుసగా బెంగళూరు, పూణె, చెన్నై, నోయిడా, ముంబై, జైపూర్, హైదరాబాద్, పాట్నా, ఢిల్లీ, కోల్‌కతా వేదికగా కబడ్డీ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా ప్రతిష్ఠాత్మక ప్రో కబడ్డీ టోర్నీకి ముందు పీకేఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఒక వీడియోను షేర్ చేసింది. అందులో టీమిండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ రవి శాస్త్రి చిన్న వయసులో కబడ్డీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నేను చిన్నప్పుడు ముంబై వీధుల్లో కబడ్డీ ఆడేవాడిని. సాయంత్రం పూట ఆడుకునేవాళ్లం కాబట్టి ఆట చాలా సరదాగా ఉండేది. కాలనీ వాళ్లంతా కలిసి ఆడుకునేవాళ్లం. ఇక 50 మంది బృందం మా ఆట చూసేవారు’ అని అప్పటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నాడు శాస్త్రి.
ఇక కబడ్డీకి అవసరమైన ఫిట్‌నెస్ లెవెల్స్‌పై కూడా పలు సూచనలు ఇచ్చాడీ టీమిండియా కెప్టెన్.. ‘కబడ్డీకి మంచి ఫిట్‌నెస్ లెవెల్స్ చాలా ముఖ్యం. కేవలం మన దేశంలోనే కాదు పోలాండ్, న్యూజిలాండ్ తదితర దేశాల్లోని ప్రజలు కబడ్డీ క్రీడను అమితంగా ఇష్టపడతారు’ అని రవి శాస్త్రి తెలిపాడు. టీమిండియా మరో క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా కబడ్డీతో తన అనుభవాలను పంచుకున్నాడు. ‘ముంబైలో చాలా చోట్ల రాత్రి పూట కబడ్డీ పోటీలు జరిగేవి. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చేవారు. నేను కూడా ఈ పోటీలను చూసేందుకు వెళ్లే వాడిని. నా దృష్టిలో కబడ్డీ కంటే క్రికెట్ ఆడడం చాలా తేలిక. హెల్మెట్ పెట్టుకుని ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం కంటే కబడ్డీ ఆడడం చాలా కష్టమైనది. ఇందుకోసం ఎంతో మానసిక సన్నద్ధత, ఫిట్‌నెస్ లెవెల్స్ అవసరం’ అని మంజ్రేకర్ అభిప్రాయ పడ్డాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..