AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PKL 2024: పుణెరి పల్టాన్‌కు రెండో విజయం.. 15 పాయింట్ల తేడాతో పాట్నా పైరేట్స్‌ ఓటమి..

ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌ పుణెరి పల్టాన్ వరుసగా రెండో విజయం సాధించింది. రైడింగ్‌, డిఫెన్స్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ 15 పాయింట్స్ తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. సోమవారం రాత్రి ఇక్కడి  జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పుణెరి 40–25 తేడా తో పట్నా పైరేట్స్‌పై ఘన విజయం సాధించింది.

PKL 2024: పుణెరి పల్టాన్‌కు రెండో విజయం.. 15 పాయింట్ల తేడాతో పాట్నా పైరేట్స్‌ ఓటమి..
Puneri Paltan Defeat Patna Pirates
Janardhan Veluru
|

Updated on: Oct 21, 2024 | 10:28 PM

Share

హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌ పుణెరి పల్టాన్ వరుసగా రెండో విజయం సాధించింది. రైడింగ్‌, డిఫెన్స్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ 15 తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. సోమవారం రాత్రి ఇక్కడి  జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పుణెరి 40–25 తేడా తో పట్నా పైరేట్స్‌పై ఘన విజయం సాధించింది. కెప్టెన్‌, ఆల్‌రౌండర్ అస్లాం ఇనాందార్ (9 పాయింట్లు), మోహిత్ గోతయ్‌ (8) సత్తా చాటారు. డిఫెండర్లు గౌరవ్ ఖత్రి (6), అమన్ (6) కూడా ఆకట్టుకున్నారు. పట్నా పైరేట్స్ జట్టులో దేవాంక్ (6), అంకిత్ (6), అయాన్ (5) పోరాడినా మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు. ఈ మ్యాచ్‌లో పుణెరి రెండుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది.

ఈ మ్యాచ్‌లో ఆట ఆరంభం నుంచే పుణెరి జోరు ప్రదర్శించింది. వరుసగా నాలుగు పాయింట్లతో 4–0తో ఆ జట్టు మ్యాచ్‌ను మొదలు పెట్టింది. పట్నా కోర్టులో ముగ్గురే మిగలగా అస్లాం ఇనాందార్‌‌ను సూపర్ ట్యాకిల్ చేసిన ఆ జట్టు ఖాతా తెరిచింది. మోహిత్ గోయత్‌ను కూడా ట్యాకిల్ చేసి 4–4తో స్కోరు సమం చేసింది. కానీ, అస్లాం ఇనాందర్ డబుల్ రైడ్‌ పాయింట్‌తో పుణెరి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. అక్కడి నుంచి ఆ జట్టు వరుస పాయింట్లతో విజృంభించింది. ఈ క్రమంలో 13వ నిమిషంలో ప్రత్యర్థిని తొలిసారి ఆలౌట్ చేసి 16–8తో ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. అదే జోరుతో 20–10తో మొదటి అర్ధభాగాన్ని ముగించింది.

Puneri Paltan Defeat Patna Pirates3

Puneri Paltan Defeat Patna Pirates

విరామం తర్వాత అస్లాం ఇనాందర్‌ను నిలువరించిన పట్నా డిఫెండర్లు పంకజ్ మోహితేను సూపర్‌‌ ట్యాకిల్ చేసి తమ జట్టును రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, పల్టాన్ రైడింగ్‌తో పాటు డిఫెన్స్‌లోనూ సత్తా చాటుతూ తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఈ క్రమంలో పట్నా కోర్టులో మిగిలిన దేవాంక్‌ను ప్రత్యర్థికి దొరికిపోయాడు. దాంతో రెండోసారి ఆలౌట్‌కు గురైన పట్నా 15–27తో వెనుకబడింది. అస్లాంతో పాటు మోహిత్ గోయత్ రైడింగ్‌లో సత్తా చాటగా.. గౌరవ్ ఖత్రి, అమన్ తమ ఉడుం పట్టుతో పట్నా రైడర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. మరోవైపు పట్నా అన్ని విభాగాల్లో తేలిపోయింది. సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా జాంగ్ కున్ లీని దింపినా పాయింట్లు రాబట్టలేక ఓటమి మూటగట్టుకుంది.

కాగా, ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో జైపూర్ పింక్‌ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడుతుంది. రెండో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌తో బెంగళూరు బుల్స్‌ పోటీ పడుతుంది.