
Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నారు. ఇప్పటికే మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించగా, తాజాగా షూటింగ్ విభాగంలో భారత్‌కు రెండో గోల్డ్ మెడల్ లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్‌లో భారత క్రీడాకారులు కమల్‌జీత్ (Kamaljeet), సురుచి సింగ్ (Suruchi Singh) అద్భుతమైన ప్రతిభ కనబరిచి దేశానికి పసిడి పతకాన్ని అందించారు. ఈ విజయంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఏషియన్ రికార్డును బద్దలు కొట్టిన భారత జోడీ
ఈ తుది పోరులో కమల్‌జీత్, సురుచి సింగ్ జోడీ మొత్తం 484.4 పాయింట్ల స్కోరు సాధించి సరికొత్త ఏషియన్ రికార్డును సృష్టించింది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ ఆటగాళ్ల పేరిట ఉన్న 481.3 స్కోరు రికార్డును మన క్రీడాకారులు బద్దలు కొట్టడం విశేషం. పోటీ ఆరంభం నుంచే ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లిన ఈ భారత జోడీ, ఇండోనేషియా జట్టు ఎలిమినేట్ అయ్యే నాటికి ప్రత్యర్థుల కంటే ఏకంగా 5.8 పాయింట్ల ఆధిక్యంలో నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.
రజత, కాంస్య పతకాలు
ఈ ఉత్కంఠభరితమైన ఈవెంట్‌లో దక్షిణ కొరియాకు చెందిన సూహియాన్ హొంగ్, గాయున్ చూ జోడీ 478.0 పాయింట్లతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అలాగే ఇరాన్‌కు చెందిన వహిద్ గోల్‌ఖండన్, హనియేహ్ రోస్తమియాన్ జోడీ 415.8 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ప్రపంచ స్థాయి షూటర్ల గట్టి పోటీని ఎదుర్కొంటూ మన భారతీయ క్రీడాకారులు ప్రదర్శించిన పట్టుదల అందరి ప్రశంసలను అందుకుంటోంది.
క్వాలిఫికేషన్‌లోనూ అదరగొట్టిన మన షూటర్లు
ఫైనల్ మ్యాచ్‌కి ముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లోనూ ఈ భారత జోడీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఏకంగా 587 పాయింట్లు సాధించి ఏషియన్ గేమ్స్ క్వాలిఫికేషన్ రికార్డును సృష్టించారు. అంతకుముందు గత హాంగ్జౌ ఏషియన్ గేమ్స్‌లో మన దేశానికే చెందిన సరబ్‌జ్యోత్ సింగ్, దివ్య సుబ్బరాజు పేరిట ఉన్న 577 పాయింట్ల రికార్డును వీరు అధిగమించారు. అంతేకాకుండా గతంలో సౌరభ్ చౌదరి, మను భాకర్ సాధించిన ఏషియన్ రికార్డును కూడా ఈ జోడీ సమం చేయడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..