Paris Olympics 2024: టోక్యో ఒలింపిక్స్ 2021లో అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకంతో పాటు బలమైన ప్రదర్శన చేసి ఏడు పతకాలు భారత ఆటగాళ్లు సాధించారు. అలాగే టోక్యో పారాలింపిక్స్‌లోనూ భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేసి మొత్తం 5 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. దీంతో 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ కోసం భారత్ తన ప్లేయర్లను ఇప్పటి నుంచే సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇండియా మిషన్ ఒలింపిక్ సెల్ (MOC)లో ఏడుగురు మాజీ అథ్లెట్లు సభ్యులుగా ఉన్నారు. ఈ విషయాన్ని క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఇందులో భైచుంగ్ భూటియా (ఫుట్‌బాల్), అంజు బాబీ జార్జ్ (అథ్లెట్), సర్దార్ సింగ్ (హాకీ), అంజలి భగవత్ (షూటింగ్), విరేన్ రస్కిన్హా (హాకీ), మోనాలిసా బారువా (టేబుల్ టెన్నిస్), తృప్తి ముర్గుండే (బ్యాడ్మింటన్) ఉన్నారు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం ట్వీట్ చేశారు.
అథ్లెటిక్స్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఈ ఆటగాళ్ల అనుభవం కీలకపాత్ర పోషిస్తుందని అన్నాడు. మిషన్ ఒలింపిక్ సెల్ 2016లో నెలకొల్పామని తెలిపారు. దీని ద్వారా అథ్లెటిక్స్‌లో శిక్షణ, బోర్డింగ్, లాడ్జింగ్ కోసం ఏర్పాట్లు చేస్తారు. క్రీడాకారులను మెరుగుపరచడానికి విదేశాలకు పంపుతారు. గతేడాది ఇదే మిషన్ కింద బజరంగ్ పునియాను కూడా విదేశాలకు పంపించారు. అదే సమయంలో ప్రతిభావంతులను కనుగొనడానికి ఇదే సరైన వేదిక అని పేర్కొన్నారు.
ప్యారిస్ ఒలింపిక్స్ పైనే..
అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేస్తూ- పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం భారత్ సన్నద్ధతను బలోపేతం చేస్తాం. మిషన్ ఒలింపిక్ సెల్‌కు మరో ఏడుగురు అగ్రశ్రేణి అంతర్జాతీయ ఆటగాళ్లను ప్రకటించడం, స్వాగతించడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.