Junior Hockey World Cup: క్వార్టర్స్‌కు చేరిన భారత్.. చివరి మ్యాచ్‌లో పోలాండ్‌‌పై 8-2తేడాతో ఘన విజయం

|

Nov 28, 2021 | 6:47 AM

India vs Poland: భారత్ తన మొదటి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఆ తర్వాత టీమ్ ఇండియా కెనడా, పోలాండ్‌లను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా అద్భుతంగా పునరాగమనం చేసింది.

Junior Hockey World Cup: క్వార్టర్స్‌కు చేరిన భారత్.. చివరి మ్యాచ్‌లో పోలాండ్‌‌పై 8-2తేడాతో ఘన విజయం
Indian Junior Hockey Team
Follow us on

Junior Hockey World Cup 2021: FIH జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ 2021లో, భారత జట్టు టైటిల్ డిఫెన్స్ ప్రచారంలో తదుపరి దశకు చేరుకుంది. భారత జూనియర్ హాకీ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో పోలాండ్‌ను 8-2తో ఓడించి నాకౌట్ రౌండ్‌కు చేరుకుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే టీం ఇండియా అద్భుతంగా పునరాగమనం చేసి, కెనడా, పోలాండ్‌లను ఓడించి క్వార్టర్స్‌లో చోటు దక్కించుకుంది. పూల్ బీలో భారత జట్టు 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఫ్రాన్స్ అగ్రస్థానంలో నిలిచింది.

ఫ్రాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. టోర్నమెంట్‌లో పునరాగమనం చేసి, వరుసగా రెండోసారి టైటిల్ పోటీదారులుగా నిలిచింది. మ్యాచ్ రెండో అర్ధభాగంలోనూ భారత జట్టు బలమైన ప్రదర్శన చేసింది. తొలి అర్ధభాగంలో 3-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ రెండో అర్ధభాగంలో 5 గోల్స్ చేసి సులభమైన విజయాన్ని నమోదు చేసింది. పోలాండ్‌కు రెండు గోల్‌లు చివరి క్వార్టర్‌లోనే వచ్చాయి. మరోసారి టీమిండియా తరఫున సంజయ్, అరిజిత్ సింగ్ హుందాల్, సుదీప్ తలో 2 గోల్స్ చేయగా, ఉత్తమ్ సింగ్, శారదా నంద్ తివారీ చెరో గోల్స్ చేశారు.

ప్రథమార్ధంలో 3-0 ఆధిక్యంలో..
మ్యాచ్ నాలుగో నిమిషంలోనే సంజయ్ గోల్ చేయడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఎనిమిదో నిమిషంలో అరిజిత్ సింగ్ హుందాల్ పెనాల్టీ కార్నర్ సాయంతో టీమ్ ఇండియా ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. తొలి క్వార్టర్ 2-0తో ముగిసింది. రెండో క్వార్టర్‌లో పోలాండ్‌ పలుమార్లు భారత్‌ దాడులను అడ్డుకుంది. అయితే 24వ నిమిషంలో సుదీప్‌ మూడో గోల్‌ చేశాడు. అతను బంతితో పోలాండ్ సర్కిల్‌లోకి ప్రవేశించాడు. డిఫెండర్లను కొట్టేటప్పుడు రివర్స్ ఫ్లిక్‌లో గోల్ చేశాడు. దీంతో తొలి అర్ధభాగం 3-0తో భారత్‌కు అనుకూలంగా మారింది.

ద్వితీయార్థంలో గోల్స్ వర్షం..
సెకండాఫ్‌లో కూడా కథలో మార్పు లేనప్పటికీ భారత్‌ దూకుడు పెంచింది. సెకండాఫ్ తొలి క్వార్టర్‌లో.. అంటే మ్యాచ్ మూడో క్వార్టర్‌లో భారత్ వెనువెంటనే మరో గోల్ చేసింది. 35వ నిమిషంలో కెప్టెన్ వివేక్ సాగర్ ప్రసాద్ ఇచ్చిన క్రాస్‌ను ఉత్తమ్ సింగ్ గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత 3 నిమిషాల తర్వాత శారదా నంద్ తివారీ పీసీలో గోల్ చేసి భారత్‌ను 5-0తో ముందంజలో ఉంచింది. రెండు నిమిషాల తర్వాత, సుదీప్ మ్యాచ్‌లో తన రెండవ గోల్ చేసి, భారత్‌కు ఆరో గోల్ అందించాడు.

పోలాండ్‌ విఫల ప్రయత్నం..
చివరి క్వార్టర్‌లో పోలాండ్ 50వ, 54వ నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ చేసినప్పటికీ, పునరాగమనం అసాధ్యమైంది. 57వ నిమిషంలో సంజయ్‌, చివరి నిమిషంలో హుండాల్‌ మరో గోల్ చేయడంతో భారత్‌కు 8-2తో సునాయాస విజయాన్ని అందించారు. భారత జట్టు విజయానికి ముందు, ఫ్రాన్స్ అదే గ్రూప్‌లో కెనడాను 11-1తో ఓడించి గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచింది.

Also Read: ISL 2021: మోహన బగన్‌కు అద్భుత ఆరంభం.. విజయం కోసం ఈస్ట్‌ బెంగాల్ ఎదురుచూపులు..!

IND vs NZ 1st Test, Day 3: మూడో రోజు ఆధిపాత్యాన్ని ప్రదర్శించిన భారత బౌలర్లు.. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో..