Nikhat Zareen: చరిత్ర సృష్టించిన తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్‌ జరీన్‌.. ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్‌లో ఘన విజయం..

|

May 20, 2022 | 6:10 AM

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో ఫైనల్స్‌లో గెలిచి తెలుగు నేల సత్తా చాటింది. థాయ్‌లాండ్‌కు చెందిన జుటమస్ జిట్పంగ్‌పై ఘన విజయం సాధించింది.

Nikhat Zareen: చరిత్ర సృష్టించిన తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్‌ జరీన్‌.. ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్‌లో ఘన విజయం..
Nikhat Zareen
Follow us on

తెలంగాణ బిడ్డ.. ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో చరిత్ర సృష్టించింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య నిర్వహిస్తున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్‌ పోటీల్లో దేశ యువ బాక్సర్ నిఖత్ జరీన్.. సరికొత్త చరిత్ర లిఖించింది. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో ఫైనల్స్‌లో గెలిచి తెలుగు నేల సత్తా చాటింది. థాయ్‌లాండ్‌కు చెందిన జుటమస్ జిట్పంగ్‌పై ఘన విజయం సాధించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ 52 కేజీల ఫైనల్లో భారత బాక్సర్ జరీన్ 5-0తో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్ జిట్‌పాంగ్‌ను ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. నిఖత్.. MC మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ RL, లేఖ సితో కలిసి ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న ఐదవ భారతీయ మహిళా బాక్సర్‌గా నిలిచింది. కాగా.. సెమీఫైనల్లో నిఖత్ జరీన్.. బ్రెజిల్‌కు చెందిన కారలిన్‌ డీ అల్మెదాపై 5-0 తేడాతో సునాయాసంగా గెలుపొందింది. కాగా.. నిఖత్ జరీన్ ఘన విజయం సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు అభినందించారు.

తెలంగాణలోని నిజామాబాద్‌కు జిల్లాలో 14 జూన్ 1996 న పుట్టారు నిఖత్‌ జరీన్‌. ఆమె తల్లిదండ్రులు ఎండి జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా. 13 ఏళ్ళ వయస్సులోనే బాక్సింగ్‌ రింగులోకి దిగిన నిఖత్‌కి తండ్రి ప్రోత్సాహం అంతులేని ఉత్సాహాన్నిచ్చింది. హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో జలంధర్‌లో జరిగిన ఆలిండియా యూనివర్సిటీస్‌ పోటీల్లో ఆమె బెస్ట్ బాక్సర్ ఛాంపియన్ షిప్ సాధించింది. విశాఖపట్నంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బాక్సింగ్‌ శిక్షణ తీసుకుంది.

ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐవీ రావు ఆధ్వర్యంలో శిక్షణ పొందటానికి 2009 లో విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేరింది జరీన్‌. ఏడాది తిరగకుండానే జరీన్‌ని 2010 లో ఈరోడ్‌లో జరిగిన నేషనల్స్‌లో ‘గోల్డెన్ బెస్ట్ బాక్సర్‌గా’ పేరు సాధించింది నిఖత్‌ జరీన్‌.

ఇవి కూడా చదవండి

2011 లో అంటాల్యాలో జరిగిన AIBA ఉమెన్స్ యూత్ & జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించారు జమీన్‌. 2019 లో, బ్యాంకాక్‌లో జరిగిన థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో రజత పతకం కైవసం చేసుకున్నారు. 2014 లో సెర్బియాలోని నోవి సాడ్‌లో జరిగిన మూడవ నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో బంగారు పతకం సాధించారు. 2015 లో అస్సాంలో జరిగిన 16 వ సీనియర్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకున్నారు.

బక్క పలచటి మొహం. చురకత్తి లాంటి చూపు. పులిపంజా విసిరితే ఎలా ఉంటుందో అచ్చంగా అలాంటి పంచ్‌. ఇంకేముందు ప్రత్యర్థి గుండెలదరడానికి అంతకంటే ఇంకేం కావాలి. నిఖత్‌ జరీన్‌లోని స్థైర్యం ఎదుటివారిని ఖంగుతినిపించేలా ఉంటుంది. గోల్డ్‌ మెడల్‌ ఆమె చిరకాల స్వప్నం. నిజానికి యిప్పుడది ఆమె ఒక్కరి కల మాత్రమే కాదు. లక్షలాది భారతీయుల కల. కోటానుకోట్ల బాక్సింగ్‌ ప్రియులందరి కల. ఆ స్వప్నం సాకారం చేసుకొని నిఖత్‌ జరీన్‌ అందరినుంచి ప్రశంసలు అందుకుంటోంది..