ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలవడంలో జోఫ్రా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సూపర్ ఓవర్‌లో ఎంతో ఒత్తిడిని తట్టుకోని అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ తండ్రి ఫ్రాంక్ ఆర్చర్ తన కుమారుడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఏదో ఒక రోజు ఆర్చర్ క్రికెట్‌ను ఏలుతాడని పేర్నొన్నాడు. ఇక తన కొడుకుపై నమ్మకంతో సూపర్ ఓవర్ అవకాశం ఇచ్చిన సారథి ఇయాన్ మోర్గాన్‌ను కృతజ్ఞతలు తెలిపాడు.
‘ఆడేది తొలి ప్రపంచకప్, అయినా సూపర్ ఓవర్‌లో ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా జట్టును జగజ్జేతగా నిలిపాడు. దేశం గర్వించేలా చేశాడు. జట్టు సభ్యులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సూపర్ ఓవర్‌లో నీషమ్ సిక్సర్ కొట్టిన వెంటనే ఏ బౌలర్ అయినా ఆత్మరక్షణలోకి పడతాడు. కానీ, ఆర్చర్ మాత్రం దానిని అధిగమించాడు. గొప్ప ఆటగాళ్ళు మాత్రమే అలా చేయగలరు. క్రెడిట్ మొత్తం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కే దక్కుతుంది. అతడిపై పెట్టుకున్న విశ్వాసాన్ని తిరిగి చెల్లించాడు. ఆర్చర్ ఆట ఇప్పుడే ప్రారంభమైంది. బాస్కెట్ బాల్‌ను జోర్డాన్ శాసించినట్టు.. ఆర్చర్ ఏదో ఒక రోజు క్రికెట్‌ను ఏలుతాడు’అంటూ జోఫ్రా తండ్రి ఫ్రాంక్ ఆర్చర్ ఉద్వేగంగా పేర్కొన్నాడు.